close

ప్రధానాంశాలు

రెండేళ్లు ఎన్నో ఏళ్లలా అనిపించాయి : శ్రేయస్‌ అయ్యర్‌

విశాఖపట్నం : జట్టు పేరు మారింది సరే.. ఆట తీరు మారుతుందా..? అన్న ప్రశ్నలతో మొదలైన దిల్లీ క్యాపిటల్స్‌ ప్రయాణం అంచనాలకు మించి సజావుగా సాగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా హేమాహేమీ జట్లను సైతం మట్టికరిపిస్తూ ప్లేఆఫ్స్‌కు చేరింది. తాజాగా విశాఖ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌ చేరేందుకు ఇంకో మెట్టు మాత్రమే మిగిలి ఉంది. తర్వాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. అయితే, బుధవారం సన్‌ రైజర్స్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడాడు.
‘విజయం తర్వాత ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఆ అనుభూతిని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు. గడిచిన రెండు సంవత్సరాలు ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల్లా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం జట్టు ప్రదర్శన చూసి అందరూ సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా యువ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌పంత్‌, పృథ్వీ షా మంచి ఊపులో ఉన్నారు. ఫామ్‌లో ఉన్నప్పుడు వాళ్లను అడ్డుకోవడం ఏ బౌలర్‌కైనా చాలా కష్టమైన పని. ఏ జట్టు కెప్టెన్‌ అయినా అలాంటి ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని అన్నాడు. అలాంటప్పుడే వాళ్లు ఆటను ఆస్వాదిస్తారు. మంచి ఫలితాలు రాబడతారు. మేం వాళ్లిద్దరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అందుకే ఈ రోజు మ్యాచ్‌లో పంత్‌, షా ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. అమిత్‌ మిశ్రా కూడా తన అనుభవాన్ని ఉపయోగించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి మా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిశ్రాతో పాటు మిగిలిన బౌలర్లు కూడా రాణించారు. సన్‌ రైజర్స్‌కు మంచి ఆరంభం లభించినప్పటికీ మధ్య ఓవర్లలో మా బౌలర్లు స్కోరు వేగానికి కళ్లెం వేశారు. ఇదే ఊపును చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌లోనూ కొనసాగిస్తాం’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు. 
కాగా 2012 తర్వాత ప్లేఆఫ్స్‌ వరకూ చేరుకోవడం దిల్లీ జట్టుకు ఇదే తొలిసారి. ఇంతవరకూ ఒక్కసారి కూడా ఫైనల్‌లో అడుగుపెట్టకపోవడం గమనార్హం.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net