close

ప్రధానాంశాలు

గెలుపు వాకిట్లోనే ఉండిపోయాం:విలియమ్సన్‌

విశాఖపట్నం: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తడబడింది. డేవిడ్‌ వార్నర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. కేవలం 12 పాయింట్లతో ఉన్న ఆ జట్టు రన్‌రేట్‌ కలిసిరావడంతో ప్లేఆఫ్స్‌ దశకు చేరినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓటమిపై సన్‌ రైజర్స్‌ సారథి విలియమ్సన్‌ స్పందించాడు. ఈ మ్యాచ్‌ మా జట్టుకు నిరాశ మిగిల్చిందన్నాడు.

‘మేం నిర్దేశించింది మంచి లక్ష్యమే. ఈ పిచ్‌పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు పెట్టాం. అయితే దిల్లీ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా ఆడారు. ఈ విజయానికి వాళ్లు పూర్తి అర్హులు. దిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ జట్టుగా రాణించారు. మేం బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విషయాల్లో అవకాశాలు జారవిడిచాం. ఇలాంటి వికెట్‌పై ఛేదన కొంచెం కష్టంతో కూడుకున్నదే. ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లే మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచుల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుంది. కానీ, అలా జరగలేదు. వార్నర్‌, బెయిర్‌స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడాం. అయితే, అన్ని ప్రతి మ్యాచ్‌లో దాదాపు విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్‌ కూడా అలాంటిదే. గెలుపు వాకిట్లో బోల్తా పడ్డాం. వచ్చే సీజన్‌లో మరింత రాణించేందుకు కృషి చేస్తాం’ అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఇలా ఎలిమినేటర్‌లో ఓడిపోవడం ఇది మూడో సారి. రెండు సార్లు ఫైనల్‌లో అడుగుపెట్టిన ఆ జట్టు 2016తో విజేతగా నిలిచి 2018ల్లో రన్నరప్‌గా ఉంది.

ప్లేఆఫ్స్‌లో సన్‌ రైజర్స్‌..

సంవత్సరం ఫలితం ప్రత్యర్థి 
2013 నాలుగు వికెట్ల తేడాతో ఓటమి రాజస్థాన్‌ రాయల్స్‌
2016 22 పరుగుల తేడాతో విజయం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
2017 ఏడు వికెట్ల తేడాతో ఓటమి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
2018 14 పరుగుల తేడాతో విజయం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
2019 రెండు వికెట్ల తేడాతో ఓటమి దిల్లీ క్యాపిటల్స్‌

 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net