close

ప్రధానాంశాలు

కన్నీళ్లు పెట్టుకున్న సన్‌ రైజర్స్‌ కోచ్‌

విశాఖపట్నం : కళ్లముందే మ్యాచ్‌ చేజారిపోతుండటంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దిల్లీ గెలవాలంటే 18 బంతుల్లో 34 పరుగులు కావాలి. అప్పటికే వరుసగా వికెట్లు పడుతుండటంతో సన్‌ రైజర్స్‌దే విజయం అనుకున్నారంతా. కానీ థంపీ వేసిన 18వ ఓవర్లో దిల్లీ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. ఆ ఓవర్‌ ముగిసిన తర్వాత సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారింది. దీంతో మ్యాచ్‌ దిల్లీవైపు మొగ్గింది. రిషభ్‌ పంత్‌ (49) చెలరేగడంతో ఇంకో బంతి మిగిలి ఉండగానే దిల్లీ విజయం సాధించింది. దీంతో సన్‌ రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించకతప్పలేదు. ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ ఓడిపోవటంతో జట్టు కోచ్‌ టామ్‌ మూడీ భావోద్వేగానికి గురయ్యారు.

18వ ఓవర్‌ వేస్తున్న సమయంలో మ్యాచ్‌ చేజారిపోతున్న విషయాన్ని గ్రహించిన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టాకున్నారు. మరోవైపు మైదానంలో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సైతం కొంత బావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. అయితే, దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు ఐపీఎల్‌లో తన జట్టు ఓడిపోతే ఏడ్చిన తొలి కోచ్‌ మూడీ.. ఈ మ్యాచ్‌లో ఇదే చేదు సంఘటన.. క్రికెట్‌ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఇదో భావోద్వేగం అని పేర్కొంటున్నారు. సన్‌ రైజర్స్‌ టైటిల్‌ గెలవకపోవచ్చు. కానీ, అందరి మనసు గెలిచింది అంటూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net