close

ప్రధానాంశాలు

పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఫోన్‌కాల్‌ ఎవరికి?

విశాఖ: ఐపీఎల్‌ 12లో భాగంగా జరిగిన ఎలిమినేటర్‌ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్‌ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్‌ను అత్యంత ఉత్కంఠ రేకెత్తించాయి. రిషభ్ పంత్‌ చెలరేగడంతో హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 2 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 2.5 ఓవర్లలో 2/24 వికెట్లు తీశాడు. అర్ధశతకం సాధించిన ఓపెనర్‌ పృథ్వీషాను, శ్రేయస్‌ అయ్యర్‌ను వెంటవెంటనే ఔట్‌ చేశాడు. ఈ సందర్భంగా అతడి సంబరాలు అందరినీ ఆకర్షించాయి. వికెట్‌ తీసిన ప్రతిసారీ అతడు ఫోన్‌ కాల్‌ చేస్తున్నట్టు సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడు చేసిన సంజ్ఞల తాలూకు అర్థం ఏమిటా అని అభిమానులు ఆలోచించసాగారు.

ఖలీల్‌ అహ్మద్‌ చేసిన ఫోన్‌కాల్‌ బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కే అని ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బృందంలో ఖలీల్‌కు చోటు దక్కలేదు. తాను అద్భుత ప్రదర్శన చేస్తున్నా ఫోన్‌కాల్‌ ఎందుకు రావడం లేదని చెప్పేందుకు ఇలా చేశాడని అంటున్నారు. అంబటి రాయుడు సైతం ప్రపంచకప్‌నకు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఎంపికైన విజయ్‌ శంకర్‌ 3 కోణాల్లో ఉపయోగపడతాడని ఎమ్మెస్కే చెప్పారు. దాంతో తాను ప్రపంచకప్‌ను చూసేందుకు ‘3డీ కళ్లద్దాలు’ కొనుగోలు చేయబోతున్నట్టు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత రోజే రాయుడు, పంత్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేస్తున్నామని సెలక్టర్లు ప్రకటించారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net