close

ప్రధానాంశాలు

హైదరాబాద్‌కు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ 

ఐపీఎల్‌-12 ఫైనల్లో సూపర్‌కింగ్స్‌ 
క్వాలిఫయర్‌-2లో దిల్లీపై విజయం 
మెరిసిన వాట్సన్‌, డుప్లెసిస్‌ 
ఈనాడు - విశాఖపట్నం

ఐపీఎల్‌-12 అదిరే క్లైమాక్స్‌ను అందించబోతోంది. మూడు సార్లు ఛాంపియన్‌ చెన్నై.. అన్నేసార్లు విజేతగా నిలిచిన ముంబయిని టైటిల్‌ సమరంలో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. తొలిసారి ఫైనల్‌ చేరాలన్న దిల్లీ క్యాపిటల్స్‌ కల నెరవేరలేదు. బంతితో, బ్యాటుతో విశాఖలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సూపర్‌కింగ్స్‌.. క్వాలిఫయర్‌-2లో దిల్లీని మట్టికరిపించింది. చెన్నైకిది ఎనిమిదో ఐపీఎల్‌ ఫైనల్‌ కావడం విశేషం. ఈ ఐపీఎల్‌ ఫైనల్‌కు ఆదివారం హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. 

ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌-12 ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో 6 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ (2/28), బ్రావో (2/19), జడేజా (2/23), హర్భజన్‌ (2/31) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట దిల్లీ 9 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. రిషబ్‌ పంత్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు వాట్సన్‌ (50; 32 బంతుల్లో 3×4, 4×6), డుప్లెసిస్‌ (50; 39 బంతుల్లో 7×4, 1×6) రెచ్చిపోవడంతో లక్ష్యాన్ని చెన్నై మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. చెన్నై ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఈ ఐపీఎల్‌లో చెన్నై.. క్వాలిఫయర్‌-1 సహా ముంబయితో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సంగతి తెలిసిందే. 
చెలరేగిన చెన్నై ఓపెనర్లు: చెన్నై చివరికి అలవోకగానే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆరంభంలో ఒత్తిడికి గురైంది. తొలి ఓవర్లో బౌల్ట్‌.. పదునైన పేస్‌తో ఓపెనర్లు డుప్లెసిస్‌, వాట్సన్‌లను బెంబేలెత్తించాడు.  మూడో బంతికి దిల్లీకి తొలి వికెట్‌ దక్కాల్సింది. ఓపెనర్ల సమన్వయం లోపం కారణంగా వచ్చిన మంచి రనౌట్‌ అవకాశాన్ని.. పేలవ ఫీల్డింగ్‌తో వదిలేసింది దిల్లీ. రెండో ఓవర్లో ఇషాంత్‌ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. కానీ నెమ్మదిగా కుదురుకున్న డుప్లెసిస్‌ మూడో ఓవర్‌ నుంచి బ్యాట్‌ ఝుళిపించడం మొదలుపెట్టాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన అతడు.. అదే జోరును కొనసాగించి తన జట్టుపై ఒత్తిడి పోగొట్టాడు. అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పట్టించాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యంగా పుంజుకున్న వాట్సన్‌.. పాల్‌, మిశ్రా బౌలింగ్‌లో ఒక్కో ఫోర్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సిక్స్‌ దంచడంతో చెన్నై 10 ఓవర్లలో 81/0తో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే డుప్లెసిస్‌ను బౌల్ట్‌ ఔట్‌ చేసినా.. దిల్లీ సంతోషించడానికి ఏమీ లేకపోయింది. గేర్‌ మార్చిన వాట్సన్‌.. విధ్వంసం సృష్టించాడు. అతడు మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదడంతో కీమో పాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. వెంటనే మిశ్రా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు యత్నించిన వాట్సన్‌ నిష్క్రమించినా.. చేయాల్సిన స్కోరు ఎక్కువేమీ లేకపోవడంతో చెన్నైకి కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. అంబటి రాయుడు (20 నాటౌట్‌).. రైనా (11)తో మూడో వికెట్‌కు 18, ధోని (9)తో నాలుగో వికెట్‌కు 19 పరుగులు జోడించి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. బ్రావో (0)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. 
దిల్లీకి కళ్లెం..: ధావన్‌ చకచకా మూడు బౌండరీలు బాదినా.. దిల్లీ ఇన్నింగ్స్‌ పేలవంగానే ఆరంభమైంది. ఏ దశలోనూ జోరందుకోలేదు. నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పేసర్‌ దీపక్‌ చాహర్‌.. చెన్నైకి మరోసారి శుభారంభాన్నిచ్చాడు. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛనివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన అతడు మూడో ఓవర్లోనే ఓపెనర్‌ పృథ్వీ షా (5)ను వెనక్కి పంపాడు. హర్భజన్‌ కూడా పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 41/2తో నిలిచింది. ఆరో ఓవర్లో ధావన్‌ (18; 14 బంతుల్లో 3×4)ను భజ్జీ ఔట్‌ చేశాడు. జడేజా బౌలింగ్‌లోనూ దిల్లీకి పరుగులు రాబట్టడం కష్టమైంది. తన తొలి రెండు ఓవర్లలో రెండు పరుగులే ఇచ్చిన జడేజా.. మన్రో (27; 24 బంతుల్లో 4×4)ను పెవిలియన్‌కు పంపించాడు. 10 ఓవర్లకు స్కోరు 68/3. ఆ తర్వాత కూడా దిల్లీ స్కోరు బోర్డు పెద్దగా వేగాన్ని అందుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ (13), రూథర్డ్‌ఫర్డ్‌ (10), కీమో పాల్‌ (3) వెంటవెంటనే వెనుదిరిగారు. రిషబ్‌ పంత్‌ 19వ ఓవర్‌కు క్రీజులోనే ఉన్నా ఎప్పటిలా ధాటిగా ఆడలేకపోయాడు. అయినా జట్టుకు విలువైన పరుగులే అందించాడు. తాహిర్‌ వేసిన 17వ ఓవర్లో అతడు ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. 19వ ఓవర్లో చాహర్‌ బౌలింగ్‌లో పంత్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 125 పరుగులే.  దిల్లీ 140 కూడా దాటదేమో అనిపించింది. కానీ జడేజా వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో బౌల్ట్‌ (6) ఓ సిక్స్‌, ఇషాంత్‌ శర్మ (10 నాటౌట్‌) వరుసగా 4, 6 బాదడంతో దిల్లీ కాస్త సంతృప్తిగానే ఇన్నింగ్స్‌ను ముగించింది.

4

చెన్నై, ముంబయి ఫైనల్లో తలపడనుండటం ఇది నాలుగోసారి. రెండింట్లో ఏది గెలిచినా రికార్డు స్థాయిలో నాలుగో కప్పు ఖాతాలో చేరుతుంది. తొలిసారి 2010లో చెన్నై, ముంబయి తలపడ్డాయి. ఆ టోర్నీలో ధోని బృందం టైటిల్‌ గెలిచింది. ఆ తర్వాత 2013, 2015లో చెన్నైని ఓడించి ముంబయి విజేతగా నిలిచింది.

ఐపీఎల్‌లో 150 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా హర్భజన్‌ సింగ్‌ ఘనత సాధించాడు. మలింగ (169), అమిత్‌ మిశ్రా (157), చావ్లా (150) ముందున్నారు.  
ఓడినా... ఓ తృప్తి! 

ఓడినా.. ఓ తృప్తి!

పీఎల్‌-12 సీజన్లో అందర్ని విశేషంగా ఆకట్టుకున్న జట్టు కచ్చితంగా దిల్లీ క్యాపిటల్సే. పేరు మార్చుకుని.. కొత్త ఆటగాళ్లను చేర్చుకుని నవోత్సాహంతో ఈ టోర్నీలో అడుగుపెట్టిన దిల్లీ.. ఆరంభం నుంచి అదిరే ప్రదర్శనే చేసింది. కళ్లుచెదిరే విజయాలను సాధించింది. రబాడ, రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా లాంటి కుర్రాళ్లు జట్టు గెలుపు పల్లకి మోశారు. గత కొన్ని సీజన్లుగా ఎంతమంది ఆటగాళ్లను మార్చినా..  చాలామంది కోచ్‌లతో ప్రయోగాలు చేసినా సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన దిల్లీ ఈసారి ఫైనల్‌కు చేరకపోయినా సంతృప్తిగానే టోర్నీని ముగించింది. క్వాలిఫయర్‌-2లో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓడినా.. మొత్తం మీద ఈ టోర్నీలో తమ జట్టు ప్రదర్శన దిల్లీకి ఆనందాన్ని ఇచ్చేదే. ఎందుకంటే ప్రతి సీజన్లో అట్టడుగు స్థానం కోసం పోటీపడే దిల్లీ.. 2012 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌ వరకూ వచ్చింది. నిజానికి ఆ జట్టుకు ఇదే పెద్ద ఘనత. కోచ్‌లు సౌరభ్‌ గంగూలీ, రికీ పాంటింగ్‌లు తెర వెనుక విజయాల్లో భాగస్వాములయ్యారు. ఈ ప్రదర్శన వచ్చే ఏడాది దిల్లీకి స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా ఎల్బీ (బి) చాహర్‌ 5; ధావన్‌ (సి) ధోని (బి) హర్భజన్‌ 18; మన్రో (సి) బ్రావో (బి) జడేజా 27; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) రైనా (బి) తాహిర్‌ 13; రిషబ్‌ పంత్‌ (సి) బ్రావో (బి) చాహర్‌ 38; అక్షర్‌ పటేల్‌ (సి) తాహిర్‌ (బి) బ్రావో 3; రూథర్డ్‌ఫర్డ్‌ (సి) వాట్సన్‌ (బి) హర్భజన్‌ 10; కీమో పాల్‌ (బి) బ్రావో 3; అమిత్‌ మిశ్రా నాటౌట్‌ 6; బౌల్ట్‌ (బి) జడేజా 6; ఇషాంత్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 8 
మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 147; 
వికెట్ల పతనం: 1-21, 2-37, 3-57, 4-75, 5-80, 6-102, 7-119, 8-125, 9-137 
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-28-2; శార్దూల్‌ ఠాకూర్‌ 1-0-13-0; హర్భజన్‌ 4-0-31-2; జడేజా 3-0-23-2; తాహిర్‌ 4-0-28-1; బ్రావో 4-0-19-2 
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) పాల్‌ (బి) బౌల్ట్‌ 50; వాట్సన్‌ (సి) బౌల్ట్‌ (బి) మిశ్రా 50; రైనా (బి) అక్షర్‌ పటేల్‌ 11; రాయుడు నాటౌట్‌ 20; ధోని (సి) పాల్‌ (బి) ఇషాంత్‌ 9; బ్రావో నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; 
మొత్తం: (19 ఓవర్లలో 4 వికెట్లకు) 151 
వికెట్ల పతనం: 1-81, 2-109, 3-127, 4-146 
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-20-1; ఇషాంత్‌ 4-0-24-1; అక్షర్‌పటేల్‌ 4-0-32-1; మిశ్రా 4-0-21-1; కీమో పాల్‌ 3-0-49-0Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net