close

ప్రధానాంశాలు

ఆ ముగ్గురి ప్రభావం నాపై ఎంతో ఉంది : శ్రేయస్‌ అయ్యర్‌

విశాఖపట్నం : పేరు మార్చుకొని ఈ సీజన్‌లో అడుగుపెట్టిన దిల్లీకి మొదట్లో అభిమానం కంటే.. అనుమానాలే ఎక్కువగా స్వాగతం పలికాయి. ‘పేరు మారింది సరే.. తీరు మారుతుందా’ లేకపోతే దిల్లీ జట్టు ఈసారి కూడా లెక్కలోలేనట్లేనా అని అందరూ తక్కువ అంచనా వేశారు. అయితే ఆ అంచానాలు తప్పని నిరూపించింది దిల్లీ క్యాపిటల్స్‌. హేమాహేమీ జట్లను మట్టికరిపించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో వెనుదిరిగింది. దిల్లీ క్యాపిటల్స్‌ విజయాలందుకోవడంలో యువ ఆటగాళ్లను ఒక్కతాటిపై నడిపించిన ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ది కీలకపాత్ర. శుక్రవారం విశాఖ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన దిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరుకోని జట్టుగానే మిగిలిపోయింది. మ్యాచ్‌ అనంతరం.. ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓటమిపై మాట్లాడాడు.
‘ఒకప్పుడు.. ధోనీ, కోహ్లీ, రోహిత్‌శర్మతో కలిసి మ్యాచ్‌లు ఆడితే అదృష్టవంతుడినే అనుకునేవాడిని. అలాంటిది వాళ్లతో పాటు కెప్టెన్‌గా టాస్‌లో పాల్గొనే అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతి. నన్ను నేను కెప్టెన్‌గా మెరుగుపరుచుకోవడంలో వాళ్ల ముగ్గురి ప్రభావం ఎంతో ఉంటుంది. మా జట్టు యాజమాన్యం సైతం కెప్టెన్‌గా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మద్దతు విషయంలో ఎన్నడూ తగ్గలేదు. దిల్లీ జట్టుతో ప్రయాణం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడి వరకూ రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఈ సీజన్‌ మాకు ఎంతో ప్రత్యేకమైంది. మున్ముందు మరింత రాణిస్తామన్న నమ్మకం ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో అనుకున్నంత లక్ష్యం నిర్దేశించలేకపోయాం. పవర్‌ప్లేలోనూ అంత మంచి ఆరంభం లభించలేదు. చెన్నై జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ల బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు. ఈ పిచ్‌ మాకు సహకరిస్తుందని అనుకున్నాం. ఇక్కడ గతంలోనూ ఒక మ్యాచ్‌ ఆడాం. అయితే మా జట్టులో ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ఈ సీజన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాం’ అని శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net