close

ప్రధానాంశాలు

ఇక ప్రపంచకప్‌ గెలవాలనుంది

ఐపీఎల్‌ ఫైనల్‌ అనంతరం హార్దిక్‌ పాండ్య

హైదరాబాద్‌: ఈ సీజన్‌ మొత్తంలో ముంబయి ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌ పాండ్య ఇకపై తన దృష్టంతా ప్రపంచకప్‌ గెలవడంపైనే ఉందని అంటున్నాడు. హైదరాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం పాండ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఫైనల్లో పది బంతుల్లో 16 పరుగులు చేసిన పాండ్య.. బౌలింగ్‌లో ఒక ఓవర్‌ వేసి మూడు పరుగులే ఇచ్చాడు. ఓ టీవీ షో కారణంగా కొన్ని నెలలముందు వరకూ సందిగ్ధంలో పడిన పాండ్య కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది. ఈ సీజన్‌లో 191.42 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీశాడు. 

ఈ సందర్భంగా పాండ్య మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో నేను చాలా బాగా ఆడాను. ఇక ముందుకు సాగాల్సిన సమయమొచ్చింది. ప్రపంచకప్‌ను కూడా ఎత్తుకోవాలని ఉంది’ అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు. ‘చిన్నప్పుడు ముంబయి ఇండియన్స్‌ పోస్టర్లను నా గదిలో అతికించుకునేవాడిని. అలాంటిది విజేతగా నిలిచిన అదే జట్టులో నేనూ సభ్యుడిగా ఉండటం ఆనందంగా ఉంది. అయితే ఈ సీజన్‌లో చెన్నైపై మూడు మ్యాచ్‌లు గెలిచాం కాబట్టి నాలుగోది చెన్నై గెలుస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ నేను కృనాల్‌కు ఒక్కటే చెప్పాను. మనం 4-0తో విజయం సాధిస్తామని అన్నాను’ అని పాండ్య పేర్కొన్నాడు.  కృనాల్‌ మాట్లాడుతూ.. ‘ఇది నమ్మశక్యం కాని ఆట. చిన్నప్పటి నుంచి మేం బాగా ఆడాలని కోరుకున్నాం. ఇప్పుడు మా కల నిజమైంది. మా తమ్ముడు చాలా బాగా ఆడతాడు. హార్దిక్‌ ఉండగా వేరొకరిని నేను స్ఫూర్తిగా తీసుకోలేను’ అని కృనాల్‌ వివరించాడు. 

మరోవైపు టీమిండియా మే 22న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌ బయలుదేరనుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే.


 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net