ప్రధానాంశాలు

Published : 07/09/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వారిద్దరి మధ్యా ఇంకా అలాగే ఉంది 

దినేశ్‌ కార్తిక్‌, ఆండ్రూ రసెల్‌పై బ్రాడ్‌హాగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌ మధ్య భేదాభిప్రాయాలు ఇంకా అలాగే ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించాలని ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ పేర్కొన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఈ ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌‌.. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా కేకేఆర్‌ వైఫల్యానికి కెప్టెన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఆ జట్టు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ రసెల్‌ మీడియాతో మాట్లాడిన తీరును గుర్తుచేసుకున్నాడు. అయితే, అప్పుడే ఈ విండీస్‌ ఆటగాడితో నెలకొన్న వివాదాలు సమసిపోయాయని దినేశ్‌ కార్తిక్‌ బయటకు చెప్పినా ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని, అదింకా అలాగే ఉందని హాగ్‌ అభిప్రాయపడ్డాడు.

వారి మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను త్వరలోనే పరిష్కరించాలని లేకపోతే మున్ముందు అవి మరింత ప్రమాదకరంగా మారతాయని చెప్పాడు. దినేశ్‌, రసెల్‌ మధ్య అనుబంధం ఒక్కటే బాగోలేదని, అది తప్పితే జట్టులో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. విండీస్‌ క్రికెటర్‌ గత ఐపీఎల్‌లో మీడియా ముందుకు వచ్చి అలా మాట్లాడటం సరైంది కాదన్నాడు. అవన్నీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చించుకునే విషయాలని హాగ్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి అనుబంధాన్ని బలోపేతం చేయడానికి హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ చొరవ తీసుకోవాలని సూచించాడు. మరికొద్ది రోజుల్లో టోర్నీ ప్రారంభమవుతుండడంతో ఆ లోపే ఈ సమస్యని పరిష్కరించాలని లేకపోతే.. ఇప్పుడున్న చిన్న సమస్యలు అప్పటికి పెద్దగా అవుతాయని మాజీ  స్పిన్నర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు గౌతమ్‌ గంభీర్‌ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దినేశ్ కార్తిక్‌ 2018లో ఆ జట్టును మూడో స్థానంలో నిలబెట్టగా గతేడాది ఐదోస్థానానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే రసెల్‌ గతేడాది మీడియాతో మాట్లాడుతూ దినేశ్‌ కార్తిక్‌ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశాడు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net