ప్రధానాంశాలు

Published : 16/06/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
AP NEWS: ఆ బాధ్యత కేంద్రానిదే:హైకోర్టు

అమరావతి: కొవిడ్‌ నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో 2,357 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 175 మరణాలు నమోదయ్యాయని, ప్రస్తుతం 1,385 కేసులు క్రియాశీలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. యాంఫోటెరిసిస్‌-బి ఇంజెక్షన్ల సరఫరాలో కొరత ఉందని ఈసందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 

వారానికి 8-10వేలకు మించి ఇంజెక్షన్లు రావట్లేదని తెలిపారు. డిమాండ్లకు తగ్గట్టు ఇంజెక్షన్లు కేంద్రం సరఫరా చేయడం లేదని వివరించారు. బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్ల కొరత తీవ్రతను అమికస్‌ క్యూరీ కోర్టు దృష్టికి తెచ్చారు. బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్రానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంజెక్షన్ల సరఫరా పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలను ఏఎస్‌జీ కోర్టుకు వివరించారు. 11 ఫార్మా కంపెనీలకు తయారీ అనుమతులు ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఎన్ని ఇంజెక్షన్లు అవసరమో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి స్థాయి వివరాలతో కౌంటర్లు దాఖలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బ్లాక్‌ ఫంగస్‌ తీవ్రత దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని హైకోర్టు ఆదేశించింది.

ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థలాల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సమస్యను కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా చేపట్టిన చర్యలపై సమగ్ర వివరాలతో మెమో దాఖలు చేయాలని ఆదేశించింది.  ఆధార్‌ లేకుండా వృద్దాశ్రమాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net