ప్రధానాంశాలు

Published : 09/06/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముం‘భయం’ తగ్గింది.. కొత్త ‘బెంగ’ మొదలైంది

కరోనా మరణాల్లో దేశంలోనే రెండో స్థానంలో బెంగళూరు
తొలి దశలో ఆదర్శంగా నిలిచిన ఉద్యాననగరి 

బెంగళూరు: కొవిడ్‌ తొలి దశ కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన బెంగళూరు.. రెండో దశలో మాత్రం విఫలమైంది.  దేశంలో అత్యధిక కొవిడ్‌ మరణాలు నమోదవుతున్న నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు రెండో స్థానంలో ఉన్న ముంబయి మెరుగైన కట్టడి చర్యలు చేపట్టడంతో అక్కడ మరణాల సంఖ్య తగ్గింది. బెంగళూరులో కొత్తగా వెలుగుచూస్తున్న కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు కారణమవుతోంది. అధికారిక సమాచారం ప్రకారం మంగళవారం నాటికి.. 24,667 కొవిడ్‌ మరణాలతో దిల్లీ మొదటి స్థానంలో నిలవగా.. 15,118 మరణాలతో బెంగళూరు రెండో స్థానంలో ఉండటం వైద్య వర్గాలను కలవరపెడుతోంది. అదే రోజు బెంగళూరులో కొత్తగా 2,022 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. ముంబయిలో కొత్తగా 682 కేసులు, ఏడు మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు సైతం ముంబయి కన్నా ఉద్యాననగరిలో ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం బెంగళూరులో 1,01,965, ముంబయిలో 15,786 క్రియాశీల కేసులున్నాయి.

రెండో దశలో.. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న బెంగళూరులో 6.53 లక్షల కేసులు, 5,800 మరణాలు సంభవించగా.. ముంబయిలో 6.27 లక్షల కేసులు, 12,790 మరణాలు చోటుచేసుకున్నాయి. అయితే  కరోనా కట్టడిలో ముంబయి క్రమంగా మెరుగైన ఫలితాలను సాధిస్తూ దేశానికి  ఆదర్శంగా నిలుస్తోంది. పరీక్షలు ఎక్కువగా చేయడం వల్ల ఇతర నగరాల కంటే ఎక్కువ కరోనా కేసులు బయటపడుతున్నాయని బెంగళూరు అధికారయంత్రాంగం తెలిపింది. అయితే బెంగళూరులో మరణాలు ఎందుకు అధిక సంఖ్యలో సంభవిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ సమర్థంగా పనిచేయకపోవడం వల్లనే తాజా పరిస్థితి తలెత్తిందని వారు అభిప్రాయపడ్డారు.  కొవిడ్ మూడో దశను సమర్థంగా ఎదుర్కోడానికి ముంబయి అనుసరించిన విధానాలను ఆచరించాలని మిగిలిన రాష్ట్రాలు, నగరాలకు సూచించారు.  

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net