ప్రధానాంశాలు

Published : 03/06/2021 19:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
TS NEWS: లాక్‌డౌన్‌తో తగ్గిన కేసులు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో  2,261 కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారని డీహెచ్‌ వెల్లడించారు. కరోనా బారి నుంచి నిన్న 3,043 మంది కోలుకున్నారని చెప్పారు. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని వెల్లడించారు. గ్రామాల్లోనూ పకడ్బంధీగా లాక్‌డౌన్‌ అమలు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా పరిస్థితులపై ఆరా తీసినట్టు చెప్పారు. వచ్చే వారంలో కేసులు తగ్గితే లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశముందని డీహెచ్‌ వెల్లడించారు.

‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 55వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయి.   రెండో విడతలో 87,49,549 ఇళ్లలో సర్వే పూర్తి చేశాం. సర్వేలో 4,037 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించాం. కొన్ని చోట్ల మూడోదశ ఇంటింటి సర్వే చేస్తున్నాం. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఐపీఎంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం 9లక్షల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో 72, మేడ్చల్‌లో 48, రంగారెడ్డిలో 37 ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయి’’ అని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్రంలో 1100 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
గత పదిరోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1100 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఉపయోగించే లీఫాసోమల్‌, అంఫోటెరిసిన్ మందుల కోసం రోగుల బంధువులు కాకుండా ఆసుపత్రుల ప్రతినిధులే కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని సూచించారు. సాధారణ అంఫోటెరిసిన్ కూడా బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు వాడాలని పేర్కొన్నారు. కొవిడ్‌ సోకిన పిల్లల్లో మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు వస్తున్నాయని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైరస్‌ సోకిన చాలా తక్కువ మంది పిల్లల్లో మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయన్నారు.


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net