ప్రధానాంశాలు

Published : 10/06/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నెలలు నిండుతున్నా.. కర్తవ్య నిర్వహణలోనే!

Image for Representation

గర్భం ధరించిన తర్వాత నెలలు నిండుతున్న కొద్దీ చాలామంది మహిళలు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇక కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అయితే అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ డాక్టరమ్మ ఎనిమిది నెలల గర్భంతో విధులకు హాజరవుతోంది. కడుపులోని బిడ్డ తన కర్తవ్య నిర్వహణకు ఆటంకం కాదంటూ కరోనాపై పోరులో భాగమవుతోంది.
ఎనిమిది నెలల గర్భంతో.. 
ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా కరోనాపై ముందుండి పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. విధుల్లో భాగంగా తమకు వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ వృత్తి ధర్మానికే కట్టుబడుతున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులను పక్కన పెట్టి మరీ వైరస్‌ వ్యతిరేక పోరులో భాగస్వాములవుతున్నారు. ఈ కోవకే చెందుతుంది జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన డాక్టర్‌ శివానీ శర్మ. లఖన్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీ. ఇలాంటి సమయంలో ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ డాక్టరమ్మ సెలవులు తీసుకోకుండా కరోనా విధులకు హాజరవుతోంది. 

కడుపులో బిడ్డను మోస్తూనే!
కశ్మీర్‌-పంజాబ్‌ సరిహద్దుల్లో ఉన్న లఖన్పూర్‌ పీహెచ్‌సీ నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది ఈ ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. అయితే అందుకు తగ్గ వైద్య సిబ్బంది ఆస్పత్రిలో లేరు. దీంతో కడుపులో బిడ్డను మోస్తూనే కరోనా రోగులకు సేవ చేస్తోంది శివానీ. మెడికల్‌ ఆఫీసర్‌గా ఈ ఏడాది మార్చిలో ఇక్కడకు వచ్చినప్పుడు ఆమె ఐదు నెలల గర్భంతో ఉంది. అప్పటి నుంచి ఇలా అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తూనే ఉంది.
వారి దీవెనలే మా బిడ్డను కాపాడతాయి!
‘మార్చిలో ఇక్కడకు వచ్చినప్పుడు సంతోషమేసినా కొంచెం ఒత్తిడికి గురయ్యాను. కొవిడ్‌ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ విధులకు హాజరవ్వడమనేది కష్టంతో కూడుకున్నదే. కానీ డ్యూటీ తప్ప నా మదిలో రెండో ఆలోచన మెదల్లేదు. కరోనాకు భయపడి ఇంట్లో కూర్చోవడానికి నా మనసు అంగీకరించలేదు. నా భర్త, అత్తమామలు కూడా నా నిర్ణయాన్ని స్వాగతించారు. ‘కష్టాల్లో ఉన్నవారికి మన చేతనైన సహాయం చేయడం మన మొదటి కర్తవ్యం. వారి నిండు దీవెనలు, ఆశీర్వాదాలే మన బిడ్డను కాపాడతాయి’ అని మొదట్లో మా వారు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి’..

‘నేను డ్యూటీలో ఉన్నప్పుడు ప్రతి 2-3 గంటలకొకసారి మా ఆయన ఫోన్‌ చేస్తారు. నా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తారు. అమ్మానాన్న, అత్తమామలు కూడా కాల్ చేసి ఒత్తిడికి గురయ్యే పనులకు దూరంగా ఉండాలని సలహాలు ఇస్తుంటారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కువగా నాన్‌-కొవిడ్‌ విధులు కేటాయిస్తున్నారు. కరోనా సోకకున్నా చాలామంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. లక్షణాలు లేకున్నా భయంతో ఆస్పత్రికి వస్తున్నారు. అలాంటి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో భరోసా నింపుతున్నాను. అలాగే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాను. ఆస్పత్రిలో సిబ్బంది కొరత బాగా ఉంది. కొవిడ్‌ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండాలనుకోవడం లేదు. అయితే ఓ గర్భిణిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పాటిస్తున్నాను. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ పీపీఈ కిట్లలోనే విధులు నిర్వర్తిస్తున్నాను’ అని చెబుతోంది శివానీ.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net