ప్రధానాంశాలు

Published : 16/06/2021 09:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మధుమేహ ఔషధంతో తీవ్రస్థాయి కొవిడ్‌కు చికిత్స

వాషింగ్టన్‌: రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి వాడే మెట్‌ఫార్మిన్‌ అనే ఔషధానికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే సామర్థ్యం ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. కొవిడ్‌-19 ఉద్ధృతం కావడానికి, కరోనా మహమ్మారితో మరణం ముప్పు పెరగడానికి ఈ ఇన్‌ఫ్లమేషన్‌ ప్రధాన కారణమవుతోంది. మెట్‌ఫార్మిన్‌.. కాలేయంలో గ్లూకోజు ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతిమంగా ఇన్సులిన్‌కు మన శరీరం స్పందించే తీరును మెరుగుపరిచి, మధుమేహ బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఔషధానికి ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించే లక్షణాలున్నాయని వెల్లడైంది. తాజాగా శాస్త్రవేత్తలు ఆ ప్రక్రియ తీరుతెన్నులను వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌) అనే ప్రాణాంతక సమస్య కలిగిన ఎలుకలపై పరిశోధనలు సాగించారు. ఈ రుగ్మత వల్ల  ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కీలక అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోవడం జరుగుతుంది. బ్యాక్టీరియా లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఇది తలెత్తుతుంటుంది. కొవిడ్‌తో ఆసుపత్రిపాలైన వారిలో మరణాలకు ఇదే ప్రధాన కారణమవుతోంది. మెట్‌ఫోర్మిన్‌ వల్ల ఎలుకల్లో ఏఆర్‌డీఎస్‌కు అడ్డుకట్టపడిందని గుర్తించారు. అలాగే ఆ రుగ్మతకు సంబంధించిన లక్షణాలూ తగ్గాయని చెప్పారు.ఐఎల్‌-1బీటా ఉత్పత్తి, ఇన్‌ఫ్లేమాజోమ్‌లను కూడా ఇది అడ్డుకుంది. ఐఎల్‌-1బీటా ఎక్కువైతే ‘సైటోకైన్‌ తుపాను’కు దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరం.. స్వీయ కణాలపైనే దాడి చేస్తుంది.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net