ప్రధానాంశాలు

Published : 18/06/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: బ్రిటన్‌లో ‘డెల్టా’ పడగ

11 రోజులకోసారి రెట్టింపవుతున్న కొవిడ్‌ కేసులు

లండన్‌: కరోనా వైరస్‌లో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్‌ వల్ల బ్రిటన్‌లో కొవిడ్‌-19 కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. 11 రోజులకోసారి ఈ సంఖ్య రెట్టింపవుతోంది. కరోనాలో మిగతా రకాలను తోసిరాజని.. ప్రధాన రకంగా డెల్టా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ 7 వరకూ నిర్వహించిన లక్ష స్వాబ్‌ పరీక్షల ఆధారంగా ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఏప్రిల్‌ నుంచి కొవిడ్‌ బాధితులు ఆసుపత్రిపాలు కావడం ఎక్కువైందని వారు చెప్పారు. మే నెలాఖరు నుంచి ఇది బాగా పెరిగిందని చెప్పారు. డెల్టా రకం.. విస్తృతంగా వ్యాప్తి చెంది, దేశంలో ఉన్న కరోనా రకాల్లో సింహభాగాన్ని ఆక్రమించిన సమయంలోనే ఈ కేసులు పెరిగాయన్నారు. దీన్నిబట్టి ఆ వేరియంట్‌ ప్రభావంతో బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు పెరుగుతున్నప్పటికీ, ఉద్ధృతంగా టీకాలు వేయడం, కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచడం వంటి నిర్ణయాల సాయంతో వైరస్‌ కట్టడికి ప్రయత్నిస్తున్నట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ చెప్పారు. సరాసరిన 10 మంది కొవిడ్‌ బాధితుల ద్వారా మరో 14 మందికి వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు కూడా తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరీక్షించిన నమూనాల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని తేలింది. ఈ రకం వైరస్‌ తొలుత భారత్‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ‘ఆందోళనకర రకం’గా డెల్టా

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ను ‘ఆందోళనకర రకం’ (వేరియంట్‌ ఆఫ్‌ కన్‌సర్న్‌)గా అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) వర్గీకరించింది. దీనితోపాటు ఆల్ఫా, బీటా, గామా, ఎప్సిలాన్‌ రకాలనూ ఈ కేటగిరీలోకి చేర్చింది. డెల్టా రకం వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, ఇప్పటికే వినియోగంలో ఉన్న మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సలకు ఇది అంతగా లొంగడంలేదని కూడా పేర్కొంది. దీనిపై టీకాల సామర్థ్యం కూడా ఒకింత తక్కువగానే ఉన్నట్లు ప్రయోగశాలల్లో జరిగిన పరీక్షల ద్వారా వెల్లడైందని వివరించింది. ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి, వ్యాధి తీవ్రత ఎక్కువగా కలిగించే వైరస్‌ వేరియంట్లను ఆందోళనకర రకాలుగా వర్గీకరిస్తున్నారు. టీకాలు, చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా ఈ రకాలపై అంతగా సమర్థతను చాటలేవు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net