ప్రధానాంశాలు

Published : 18/06/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: చనిపోయిన 26రోజులకు మృతదేహం అప్పగింత

దొనకొండ, న్యూస్‌టుడే: కొవిడ్‌తో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటూ దాదాపు 26 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి సమాచారం అందిన వైనమిది. తొలుత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారని.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలా సమాచారం ఇచ్చారంటూ బంధువులు తెలిపారు. వారు అందించిన వివరాల ప్రకారం.. దొనకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధుడు (60) గత నెల 10 వ తేదీన కరోనా బారినపడి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. అదే నెల 22న ఒంగోలు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని దహనం చేస్తామని సిబ్బంది చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చామని బంధువులు చెబుతున్నారు. దశదిన కర్మలు సైతం పూర్తిచేశామన్నారు. తీరా మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ బుధవారం దొనకొండ రెవెన్యూ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. గురువారం బంధువులు జీజీహెచ్‌ నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. దీనిపై ఆసుపత్రి అధికారుల వద్ద ప్రస్తావిస్తే కరోనాతో చనిపోయిన అనాథల మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు చేయిస్తున్నామన్నారు. స్థానిక శ్మశానవాటికలో పదుల సంఖ్యలో మృతదేహాల దహన క్రియల నిర్వహణకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నందున విడతల వారీగా ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పటివరకు మార్చురీలో ఉంచుతున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు, చిరునామా పక్కాగా ఉన్న మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలకు రూ.15 వేల సాయం కూడా అందిస్తుందన్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net