ప్రధానాంశాలు

Published : 09/05/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: ఆడిన మ్యాచ్‌లకే చెల్లించండి

స్పాన్సర్లు, ప్రకటనకర్తలతో స్టార్‌ ఇండియా సంప్రదింపులు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదాపడటంతో ఆ మ్యాచ్‌ల ప్రసార హక్కులు కొనుగోలు చేసిన స్టార్‌ ఇండియా ఛానల్‌ తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. 2018-2022 ఐదు సంవత్సరాలకు గాను స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌.. ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను రూ.16,348 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఒక్కో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాచ్‌లు జరిగేటప్పుడు విరామ సమయాల్లో ప్రకటనల కోసం స్టార్‌ ఇండియా.. పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు టైమ్‌స్లాట్‌లను పెద్ద మొత్తంలో అమ్ముకుంది.

ఇక ఈ సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29 మ్యాచ్‌లే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దాంతో ప్రకటనకర్తలు, స్పాన్సర్లు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన స్టార్‌ యాజమాన్యం.. ఆయా స్పాన్సర్లు, ప్రకటనకర్తలను ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల వరకే డబ్బు చెల్లింపులు జరపాలని కోరింది. మిగతా వాటికి.. బీసీసీఐ తిరిగి ఎప్పుడు మిగిలిన మ్యాచ్‌లను కొనసాగిస్తుందో అప్పుడు చెల్లించాలని స్పష్టం చేసింది. ‘ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో స్టార్‌ ఇండియా మా ప్రకటన కర్తలను, వారి ఏజెన్సీలను సంప్రదించింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లకే ఇప్పుడు చెల్లింపులు జరపాలని కోరింది. మిగతావి తిరిగి మ్యాచ్‌లు నిర్వహించేటప్పుడు చెల్లించొచ్చని స్పష్టం చేసింది’ అని సంబంధిత అధికారి మీడియాకు చెప్పారు.

ఇదిలా ఉండగా, గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి టీవీ వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. 2020లో 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 352 మిలియన్లుగా నమోదైందని బార్క్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయం పట్ల తాము సంతోషంగా ఉన్నా.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయటమే మంచిదని స్టార్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలనే తాము కోరుతున్నామని చెప్పారు. కాగా, గతవారం ఐపీఎల్‌ బయోబుడగలో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ సీజన్‌ మధ్యలోనే వాయిదాపడిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net