ప్రధానాంశాలు

Published : 05/06/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
T20 Worldcup: యూఏఈలోనే టీ20 ప్రపంచకప్‌!

అంతర్గతంగా అంగీకరించిన బీసీసీఐ

ముంబయి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వేదిక తరలింపునకు రంగం సిద్ధమైనట్టే! అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే పొట్టికప్‌ను యూఏఈ, ఒమన్‌లో నిర్వహించేందుకే ఐసీసీ మొగ్గు చూపుతోంది. టోర్నీ నిర్వహణపై అధికారికంగా బీసీసీసీఐకి నాలుగు వారాల గడువు ఇచ్చినా, అనధికారికంగా విషయం చెప్పేసిందని తెలిసింది. బోర్డు సైతం ఇందుకు అంగీకరించిందనే అంటున్నారు.

‘అవును, ఐసీసీ సమావేశంలో బీసీసీఐ నాలుగు వారాల సమయం కోరింది. నిర్వహణ హక్కులిస్తే, యూఏఈ, ఒమన్‌లో జరిపేందుకు అంగీకారమేనని అంతర్గతంగా చెప్పింది. ఒకవేళ ఐపీఎల్‌ అక్టోబర్‌ 10న ముగిసినా, నవంబర్‌లో ప్రపంచకప్‌ యూఏఈ లెగ్‌ ఆరంభమవుతుంది. పిచ్‌లు సిద్ధం చేసేందుకు మూడు వారాల సమయం ఉంటుంది. అదే సమయంలో మొదటి వారం మ్యాచులు ఒమన్‌లో నిర్వహిస్తారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

భారత్‌లో అక్టోబర్‌-నవంబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుందని ఐసీసీ సభ్యులు భావిస్తున్నారట. కానీ అప్పటి పరిస్థితులను అంచనా వేయడం కష్టమని అనుకుంటున్నారు. ‘ప్రస్తుతం భారత్‌లో రోజుకు 1,20,000 కేసులు వస్తున్నాయి. ఏప్రిల్‌ ఆరంభంలో నమోదైన వాటిలో ఇది పావువంతు. అలాగని జూన్‌ 28కి భారత్‌లో నిర్వహిస్తామని చెబితే, అక్టోబర్‌లో మూడోవేవ్‌ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఐపీఎల్‌ రెండో దశను తరలించేందుకు వర్షాకాలం సరైన కారణం కాదని, అసలు కారణం కొవిడ్‌ అని బీసీసీఐకీ తెలుసు. దాదాపుగా రూ.2500 కోట్ల ఆదాయం దానిపై ఆధారపడి ఉంది’ అని ఓ అధికారి వెల్లడించారు.

‘16 జట్ల ప్రపంచకప్‌లో ఏదో ఒకజట్టు వైరస్‌ బారిన పడితే అంతే సంగతులు. బలహీన దేశాల జట్లకు 14-15 మందిని భర్తీ చేసేందుకు వీలుండదు. ఇక మరో విషయం ఏంటంటే భారత్‌లో నిర్వహిస్తే విదేశీ ఆటగాళ్లు వస్తారో లేదో తెలియదు. యూఏఈలో ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చే విదేశీ క్రీడాకారులు, అక్కడే ప్రపంచకప్‌ ఆడేందుకు మరింత సంతోషిస్తారు. ఇక ఆటగాళ్లను, వారి కుటుంబ సభ్యులను క్షేమంగా చూసుకోవడం ఎంతో అవసరం. దీనికి స్థానిక బోర్డులు, ప్రభుత్వాల సాయం అవసరం. ఏదేమైనా చెప్పడం కన్నా చేయడం చాలా కష్టం’ అని ఆ అధికారి తెలిపారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net