ప్రధానాంశాలు

Published : 22/05/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: కొవిడ్‌ నుంచి కోలుకున్నా లక్షణాలున్నాయ్‌ 

షారుఖ్‌ ఖాన్‌ ధైర్యం చెప్పారు: వరుణ్‌ చక్రవర్తి..

(Photo: Varun Chakaravarthy Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి కరోనా నుంచి కోలుకున్నా ఇంకా బలహీనంగా ఉన్నానని చెప్పాడు. అలాగే ఇప్పటికీ తనకు తల తిరుగుతోందని.. దాంతో పాటు రుచీ, వాసన కూడా కోల్పోతున్నానని తెలిపాడు. ఐపీఎల్ 14వ సీజన్‌లో అందరికన్నా ముందు ఇతడే వైరస్‌ బారిన పడ్డాడు. ఆపై ఇంకొందరు కూడా కరోనాకు గురవడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. తర్వాత వరుణ్‌కు నెగిటివ్‌గా వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదన్నాడు. ‘ప్రస్తుతం నేను ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నా. శారీరకంగా బలహీనంగా ఉండటంతో ప్రాక్టీస్‌ చేయడం లేదు. కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదు. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా. కానీ, త్వరలోనే ట్రైనింగ్‌ ప్రారంభిస్తా’నని వరుణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా కోల్‌కతా బౌలర్‌ వైరస్‌ బాధితులకు పలు సూచనలు చేశాడు. ‘కరోనా నుంచి కోలుకున్నా కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. అది క్రీడాకారులైనా, మరెవరైనా కావచ్చు. మీకు నెగిటివ్‌ వచ్చినా కచ్చితంగా మాస్క్‌ ధరించండి. అది మీ చుట్టూ ఉండేవాళ్లకు రక్షణగా ఉంటుంది. అలాగే వైరస్‌ బారిన పడినప్పుడు దేని గురించీ ఆలోచించొద్దు. ముఖ్యంగా బయటి విషయాలను అస్సలు పట్టించుకోవద్దు’ అని వరుణ్‌ వివరించాడు. ఇక తనకు వైరస్‌ సోకినప్పుడు ఏం జరిగిందనే విషయాలను సైతం ఇలా చెప్పుకొచ్చాడు. ‘మే 1న కాస్త ఇబ్బందిగా అనిపించడంతో పాటు తేలికపాటి జ్వరం వచ్చింది. వెంటనే జట్టు యాజమాన్యానికి విషయం తెలియజేసి ట్రైనింగ్‌ సెషన్‌కు వెళ్లలేదు. తర్వాత ఆటగాళ్లందరికీ దూరంగా ఉన్నా. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో కంగారు పడ్డా. నా గురించే కాకుండా దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ఆందోళన చెందా. అదంత తేలికైన విషయం కాదు. కానీ, ఒక ఆటగాడిగా త్వరగా కోలుకోవాలనే మార్గాలను అన్వేషించా. మా ఫ్రాంఛైజీ కూడా ఎంతో అండగా నిలిచింది. ఐపీఎల్ వాయిదా పడ్డా నాతో ఒకరిని తోడుగా ఉంచింది. చివరికి రెండు సార్లు నెగిటివ్‌ ఫలితం వచ్చాకే ఇంటికి పంపించారు. ఆ సమయంలో షారుఖ్‌ఖాన్‌(కేకేఆర్‌ యజమాని) ఆటగాళ్లందరితో ప్రత్యేకంగా మాట్లాడి ధైర్యం నింపారు’ అని వరుణ్‌ గుర్తుచేసుకున్నాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net