ప్రధానాంశాలు

Published : 19/06/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌లో బడులు తెరిచేదెప్పుడు?

దిల్లీ: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నిర్వహణ వాయిదా పడింది.ఈ నేపథ్యంలో తిరిగి బడులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పందించారు. వీలైనంత ఎక్కువ మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతనే బడులు తెరవడం ఉత్తమమని అన్నారు. అంతేకాకుండా మూడో దశ వ్యాప్తిలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మరింత ఆచితూచి వ్యవహరించాలన్నారు. ‘‘ బడులు తెరిచే సమయం ఆసన్నమైంది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో విదేశాల్లోనూ పాఠశాలలు తెరిచేశారు. కానీ, ఒక్కసారిగా మళ్లీ విజృంభించేసరికి మూసేశారు. మన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అలాంటి పరిస్థితులు రాకూడదు.’’ అని దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీకే పాల్ వెల్లడించారు. ఈ మహమ్మారి వల్ల హాని ఉండబోదన్న భరోసా లభించినంత వరకు పాఠశాలలు తెరవకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఎయిమ్స్‌ ఇటీవల జరిపిన సర్వేలో 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలోనూ కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. ఒక వేళ మూడోదశ వ్యాప్తి వచ్చినా చిన్నారులపై ఆ ప్రభావం ఉండకపోవచ్చని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వీకే పాల్‌ మాట్లాడుతూ..సర్వేలో తేలినంత మాత్రాన పాఠశాలలు తెరచుకోవచ్చని, పిల్లలు సామాజిక దూరం పాటించనవసరం లేదని సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు కాదని అన్నారు. పాఠశాలలు తెరవాలా? వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ సర్వే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.

‘‘ కరోనా గురించి ఇప్పటికీ చాలా విషయాలు మనకు తెలియవు. పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలన్నది ప్రత్యేక అంశం. ఇది కేవలం విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇలా అందరితోనూ ముడిపడి ఉంటుంది. సామాజిక వ్యాధి నిరోధకత వృద్ధి చెందినంత మాత్రాన కరోనాను దూరం చేసినట్లు కాదు. రకరకాల అంశాలు ఇందులో నిమిడీకృతమై ఉంటాయి. వైరస్‌ తన రూపాన్ని మార్చుకోవచ్చు. వైరస్‌ ప్రభావం పిల్లలపై ప్రస్తుతం తక్కువగానే ఉండొచ్చు.. భవిష్యత్‌లో పెరిగితే పరిస్థితి ఏంటి?’’ ఇలా అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని వీకే పాల్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net