close

తాజా వార్తలు

Published : 16/11/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓఎన్‌జీసీ లాభంలో 55% క్షీణత

రూ.2,878 కోట్లకు పరిమితం
రూ.1,238 కోట్ల అసాధారణ నష్టం వల్లే..

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఓఎన్‌జీసీ నిరాశపరిచింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,878 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.6,336 కోట్లతో పోలిస్తే ఇది 54.6 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆదాయం 31 శాతం క్షీణించి రూ.16,917 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి చేసిన ముడి చమురుకు ఒక్కో బ్యారెల్‌కు 41.38 డాలర్ల చొప్పున సంపాదించింది. 2019 సెప్టెంబరు త్రైమాసికంలో 60.33 డాలర్లు ఆర్జించింది. అంటే 31.4 శాతం క్షీణత నమోదైంది. సహజ వాయువు ద్వారా ఆర్జన కూడా 1/3 వంతు క్షీణించి 1 మిలియన్‌ బ్రిటీష్‌ థర్మల్‌ యూనిట్‌కు 2.39 డాలర్లుగా నమోదైంది. అసాధారణ నష్టం (ఇంపెయిర్మెంట్‌ లాస్‌) రూ.1,238 కోట్లు రావడంతో నికర లాభం బాగా తగ్గిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. గత జనవరి-మార్చి త్రైమాసికంలో కూడా ఇలాగే రూ.4,899 కోట్ల అసాధారణ నష్టం రావడంతో ఓఎన్‌జీసీ చరిత్రలోనే తొలి త్రైమాసిక నష్టం (రూ.3,098 కోట్లు) నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, సమీక్షా త్రైమాసికంలో ముడి చమురు ఉత్పత్తి 4.78 మిలియన్‌ టన్నుల నుంచి స్వల్పంగా పెరిగి, 4.81 మి.టన్నులకు చేరింది. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం 5.9 బిలియన్‌ క్యుబిక్‌ మీటర్ల (బీసీఎమ్‌) నుంచి 5.7 బీసీఎమ్‌లకు తగ్గింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో గిరాకీ తగ్గడంతో ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో (హెచ్‌1) నికర లాభం 72.6 శాతం క్షీణించి రూ.3,374 కోట్లకు, ఆదాయం 41.4 శాతం క్షీణించి రూ.29,927 కోట్లకు పరిమితమైంది.

బీఎస్‌ఈలో షేరు 0.76% లాభపడి రూ.72.65 వద్ద ముగిసింది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని