
తాజా వార్తలు
లాక్డౌన్తో స్వచ్ఛమైన గాలి
దిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 21 రోజుల లాక్డౌన్తో ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మాత్రం వాతావరణలో కాలుష్యం గణనీయంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగకపోవడం, పరిశ్రమలు మూతపడడటమే. దిల్లీలో ఎల్లప్పుడూ ఉండే దట్టమైన కాలుష్యపు పొగమంచు జాడ ప్రస్తుతం లేదు. దేశంలోని ప్రధానమైన 103 నగరాలు, పట్టణాల్లో వాతావరణ పరీక్షలు చేయగా 88 నగరాల్లో కాలుష్య కోరల్లో నుంచి బయటపడినట్టు తేలింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్(సఫార్) జరిపిన పరీక్షల ప్రకారం ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 0-50 పాయింట్ల మధ్యలో ఉంటే స్వచ్ఛం అని, 51-100 ఉంటే సంతృప్తికరమని, 101-200 మధ్య ఉంటే నామమాత్రమని ఇక ఆపై ఉంటే ప్రమాదకరంగా పరగణిస్తారు. ఈ అంచనా ప్రకారం 23 నగరాలలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తోంది. 63 నగరాలలో సంతృప్తికరస్థాయిలో ఉండగా, బులందేశ్వర్, గువాహటిలలో మాత్రం కాలుష్యం అలాగే ఉంది.
స్వచ్ఛంగా ఉన్న నగరాలలో గాలిని విషపూరితం చేసే నైట్రోజన్ ఆక్సైడ్ శాతం పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీనిపై కేర్ ఫర్ ఎయిర్ ఎన్జీవో సంస్థ సహ వ్యవస్థాపకురాలు జ్యోతి పాండే మాట్లాడుతూ.. ఆర్థిక గమనాన్ని దెబ్బతీసే లాక్డౌన్ల ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించగలగడం అనేది మంచి పరిణామం కాకపోయినా, ఇలాగైనా కాలుష్యాన్ని తగ్గించగలమనే విషయం సృష్టమైంది. పౌరులంతా దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో వేరే మార్గంలోనైనా కాలుష్యాన్ని తగ్గించగలగాలని పేర్కొన్నారు.