close

తాజా వార్తలు

Published : 21/01/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: యనమల

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అరెస్టును శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఖండించారు. అరెస్టు చూపకుండా ఒక ఎంపీని అక్రమంగా నిర్బంధించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘అరెస్టు చేస్తే 24 గంటల్లో లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. అలాంటిది స్పీకర్‌కు తెలియకుండా, అనుమతి లేకుండా అరెస్టు చేయడం గర్హనీయం. దీనిపై తెదేపా పార్లమెంటరీ పార్టీ తరఫున లోక్‌సభ స్పీకర్‌కు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తాం. ఎంపీ గల్లా జయదేవ్‌పై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు భ్రష్టు పట్టించారు : అనిల్‌

ఏపీ శాసనసభ సమావేశాలు  రెండో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. తెదేపా సభ్యులపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ఖజానాను దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సభలో దేనికోసం రచ్చ చేస్తున్నారని తెదేపా సభ్యులను నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టే.. 23 స్థానాలు ఇచ్చారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుకట్ట 

ఏపీ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా తెదేపా అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ  రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సభ నుంచి కోపంతో వెళ్లిపోయిన స్పీకర్‌

శాసనసభలో తెదేపా సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సీ కమిషన్‌ బిల్లుపై చర్చకు సభ్యులు అడ్డుతగిలారు.  స్పీకర్‌ పోడియం వద్దకు చేరి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రకటించి.. సభ నుంచి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. చంద్రబాబు, లోకేశ్‌ తనపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాణిక్యవరప్రసాద్‌.. ఈరోజు మండలి సమావేశాలకు కూడా హాజరుకాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేను క్షమాపణ చెప్పను: రజనీకాంత్‌

సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎట్టిపరిస్థితుల్లోను క్షమాపణలు చెప్పనని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తేల్చి చెప్పారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే రజనీ తన ఇంటి బయట మీడియాతో మాట్లాడుతూ పెరియార్‌ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పనన్నారు. ‘1971లో ఏం జరిగిందో నేను చెప్పినదానిపై చర్చ జరుగుతోంది. అప్పుడు ఏం జరిగిందో మ్యాగజైన్‌లో వచ్చిన కథనాలను బట్టే నేను చెప్పాను’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జనసేనతో కలిసి పోరాడతాం: కన్నా

వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరు ప్రశాంతంగా ఉన్నారో సీఎం జగన్‌ చెప్పాలి. ప్రతి పిచ్చి పనికి కేంద్రం సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు చేస్తామని వైకాపా చెప్పలేదు. రాజధాని మార్చేందుకు వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరు. ఖర్చు ఒక్కటే కారణమని నేను అనుకోవట్లేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరఫున జనసేనతో కలిసి పోరాటం చేస్తాం’’ అని కన్నా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌

భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో, అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్‌ను చేజిక్కించుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకొన్నాయి. దీనిప్రకారం ఉబెర్‌ ఈట్స్‌ జొమాటోతో విలీనంమైంది. అందుకు ప్రతిగా ఉబెర్‌కు జొమాటోలో 9.9శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరినీ జొమాటోకు బదలాయించారు. అయితే ఉబెర్‌ ఈట్స్‌ ఉద్యోగులను మాత్రం జొమాటో స్వీకరించదట. భారత్‌లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ, లేదా వేరే విభాగాలకు మళ్లిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమరావతి గ్రామాల్లో కొనసాగుతున్న బంద్

10. స్మిత్‌ కంటే కోహ్లీనే అత్యుత్తమం

​​​​​​​భారత సారథి విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నువ్వానేనా అన్నట్లు పోటీపడుతుంటారు. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని క్రికెట్‌ ప్రపంచమంతా చర్చిస్తుంటుంది. అయితే భారత్×ఆసీస్‌ వన్డే సిరీస్‌ ముగియడంతో తాజాగా ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీలంక విలేఖరి ‘‘అన్నిఫార్మాట్‌లో స్టీవ్‌స్మిత్‌ గొప్ప బ్యాట్స్‌మన్‌ అని మరోసారి నిరూపించాడు’’ అని ట్వీట్ చేశాడు. దీనికి ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైకేల్‌ వాగన్‌ బదులిచ్చాడు. ‘‘దీన్ని ఒప్పుకోను. విరాట్‌ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్’’ అని ట్వీట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.