close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఫేస్‌బుక్‌ రారాజులం..త్వరలో కలవబోతున్నాం!

భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని మోదీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్‌ పాయింట్‌ని తెరమీదకు తెచ్చారు. ఫేస్‌బుక్‌లో ట్రంప్‌ నంబర్‌ వన్‌ అని తర్వాత మోదీ ఉన్నారన్న ఆ సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌ మాటల్ని ఈ సందర్భంగా ట్రంప్‌ ఉటంకించారు. త్వరలో తాను భారత్‌లో పర్యటించబోతున్నానని, దానికోసం ఆసక్తిగా వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గోవాలో షూటింగ్‌.. ఇది తప్పనిసరి..!

గోవాలో సినిమా షూటింగ్‌ ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో షూటింగ్‌ చేయాలంటే తప్పకుండా సినిమా స్ర్కిప్ట్‌ను అక్కడి అధికారులకు అందచేయాలి. సినిమా స్ర్కిప్ట్‌ చూసి వాళ్లు ఓకే అంటేనే గోవాలో షూటింగ్‌ చేసే అవకాశం దొరుకుతుందని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. చాలా సినిమాల్లో  గోవాను మాదకద్రవ్యాలకు గమ్యస్థానంగా చూపిస్తున్నారని, అలా చూపించడం వల్ల రాష్ట్ర గౌరవం దెబ్బతింటోందని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేంద్రమంత్రితో సీఎం జగన్‌ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు సహా వివిధ అంశాలపై న్యాయశాఖ మంత్రితో సీఎం చర్చించినట్టు సమాచారం.  పర్యటనలో సీఎంతోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేశ్‌లు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘శ్రీనివాస గౌడకు బంగారుపతకం ఇవ్వాలి’

ఉసేన్‌ బోల్ట్‌ను మించిన వేగంతో పరుగెత్తి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీనివాస గౌడపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. ‘అతడి శరీర దారుఢ్యాన్ని ఒక్కసారి చూడండి. అథ్లెటిక్స్‌లో విజయాలు సాధించే అసాధారణ సామర్థ్యం అతడికి ఉంది. అందుకే అతడికి 100మీటర్ల స్పింటర్‌లో శిక్షణ కల్పించేలా కిరణ్‌ రిజిజు చూడాలి. లేదా కంబళ క్రీడను ఒలింపిక్‌లో చేర్చేలా ప్రయత్నాలు చేయాలి. దీంతో పాటు శ్రీనివాసకు బంగారు పతకం కూడా ఇవ్వాలి’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సులేమానీ హత్య అమెరికా తప్పిదం: ఇరాన్‌

తమ దేశ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని చంపి అమెరికా తప్పు చేసిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌ మరోసారి అన్నారు. ‘జనరల్‌ సులేమానీ కంటే అమర సులేమానీ’ ఎక్కువ ప్రభావం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇరాక్‌ నుంచి విదేశీ బలగాల్ని తొలగించాలన్న ఇరాన్‌ చిరకాల డిమాండ్‌ దిశగా పరిస్థితులు కదులుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణల తర్వాత ఇరాక్‌లో అమెరికా బలగాల్ని తొలగించాలన్న వాదన ఎక్కువైందని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ వీధుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టర్కీ.. కశ్మీర్‌ విషయంలో మీ జోక్యం తగదు

కశ్మీర్‌ అంశంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తైపీ ఎర్డోగాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో జోక్యం చేసుకోవడం తగదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ఎర్డోగాన్‌ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. కాగా.. కశ్మీర్‌ విషయంలో ఎర్డోగాన్‌ పాక్‌కు మద్దతివ్వడం ఇదే తొలిసారి కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మాజీ ఐఏఎస్‌పై ప్రజా భద్రతా చట్టం

మాజీ ఐఏఎస్‌ అధికారి, జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ(జేకేపీఎం) చీఫ్‌ షా ఫైజల్‌పై పోలీసులు కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రయోగించారు. అదే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సహా మరికొంత మంది నేతలు ఇప్పటికే ఇదే చట్టం కింద నిర్బంధంలో ఉన్నారు. ఆగస్టు 5న అధికరణ 370 రద్దు చేసిన తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైజల్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీ గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం

9. ‘రిటైర్మెంట్‌పై ధోనీ ఓ నిర్ణయానికి రావాలి’

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి క్రికెట్‌ భవిష్యత్తు ఎంతో ఉందని, అయితే రిటైర్మెంట్‌పై అతడు ఓ నిర్ణయానికి రావాలని ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా అన్నాడు. ‘‘ ధోనీ అద్భుతమైన ఆటగాడు. అతడికి క్రికెట్‌ భవిష్యత్తు ఎంతో ఉంది. కానీ ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో అతడు నిర్ణయించుకోవాలి. బీసీసీఐ విధానాల ప్రకారం వీడ్కోలుపై ఆటగాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి’’ అని రాజీవ్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ తర్వాత నుంచి ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పెళ్లయిన కాసేపటికే వరుడి మృతి

నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు. గణేశ్‌కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. అప్రమత్తమైన బంధువులు వెంటనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2గంటల సమయంలో గుండెపోటుతో వరుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.