close

తాజా వార్తలు

Updated : 01/04/2020 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు పేర్కొంది. గత 12 గంటల వ్యవధిలో 373 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో 330 నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సిద్దిపేటలో తొలి కరోనా కేసు

సిద్దిపేట జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గజ్వేల్‌కు చెందిన 51ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం తెలిపారు. బాధితుడు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత పరమైన సమావేశాలకు హాజరై తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉండటంతో రెండు రోజుల క్రితం సిద్దిపేట ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అతని గొంతు నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో సదరు వ్యక్తిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నాం : బొత్స

కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. కార్మికులు, కూలీలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. సామాజిక దూరం పాటించేలా రైతుబజార్ల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు సంచార దుకాణాల ద్వారా నిత్యావసరాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా లక్షణాలతో భారత సంతతి శాస్త్రవేత్త మృతి

భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్ట్‌ కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో మరణించారు. వాక్సిన్‌ శాస్త్రవేత్త, హెచ్‌ఐవీపై పరిశోధకురాలు ప్రొఫెసర్‌ గీతా రామ్‌జీ(50) దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. తాజాగా ఆమె కరోనా వైరస్‌ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. గతవారం క్రితమే గీతా రామ్‌జీ లండన్‌ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్‌-19 సంబంధిత లక్షణాలకు చికిత్స పొందుతూ గీతా రామ్‌జీ మరణించారని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలి(ఎస్‌ఏఎంఆర్‌సీ) ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దాదాలా ధోనీ మద్దతు ఇవ్వలేదు: యువీ

తన క్రికెట్‌ కెరీర్‌లో టీమ్‌ఇండియా సారథుల్లో సౌరవ్‌ గంగూలీనే అందరి కంటే ఎక్కువ మద్దతు ఇచ్చాడని భారత మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీతో పోలిస్తే దాదా కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన కెరీర్‌ ఉత్తమంగా సాగిందని తెలిపాడు. ‘‘సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో ఆడినప్పుడు దాదా నుంచి నాకు ఎంతో మద్దుతు లభించింది. ఆ తర్వాత ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ధోనీ, కోహ్లీ నుంచి నాకు అలాంటి మద్దతు లభించలేదు’’ అని యవీ వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కోబోతున్నాం’

రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్‌తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఈ స్థాయి మాంద్యాన్ని ఎప్పుడూ చూసి ఉండి ఉండమని అంచనా వేశారు. ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న కొవిడ్‌-19, ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని చెప్పుకొచ్చారు. ‘సామాజికార్థిక పరిస్థితులపై కొవిడ్‌-19 ప్రభావం’పై నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా అర్థమేమిటంటే

‘ఇంట్లో ఉండండి.. ఇంట్లో ఉండండి’ అని చెబుతున్నారు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రస్తుతానికి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో దాని కట్టడిలో భాగంగా మనదేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటిస్తూ.. వ్యక్తిగత శుభ్రత చూసుకుంటూ.. ఇళ్లకే పరిమితం కావాలని అటు ప్రభుత్వాలతోపాటు ఇటు సినీ ప్రముఖులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘కనిపించని పురుగు’ చేతులు కడుక్కొని వినండి

8. హిట్‌మ్యాన్‌కు మోదీ ధన్యవాదాలు

మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రముఖ క్రీడాకారులు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్‌కు విరాళాలు ఇస్తున్నారు. రోహిత్‌శర్మ, మిథాలీ రాజ్‌, అథ్లెట్ శరద్‌ కుమార్‌, భారత్‌ షూటర్‌ ఇషా సింగ్‌ పీఎం కేర్స్‌కు  వితరణ చేశారు. ఈ నేపథ్యంలో వీరికి మోదీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు.  ‘‘కొవిడ్‌-19పై చేస్తున్న యుద్ధంలో మన క్రీడాకారులు ముందుండడం ఎంతో సంతోషంగా ఉంది. పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన రోహిత్‌ శర్మ, మిథాలీ రాజ్‌, శరద్‌ కుమార్‌, ఇషా సింగ్‌కు ధన్యవాదాలు’’ అని ట్వీటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గడ్డు పరిస్థితులకు సిద్ధంగా ఉండండి: ట్రంప్‌

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవమే చేస్తోంది. ‘జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ’ సేకరించిన సమాచారం ప్రకారం.. అక్కడి మృతుల సంఖ్య 3,896కు చేరింది. కరోనా మహమ్మారిని ఓ పీడగా అభిర్ణించిన అధ్యక్షుడు ట్రంప్‌ ఈ రెండు వారాలు అత్యంత బాధాకరంగా గడవనున్నాయని అభిప్రాయపడ్డారు. మరికొన్ని రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు రానున్నాయని.. ఎదుర్కోవడానికి ప్రతిపౌరుడు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్చిలో కార్ల విక్రయానికి కరోనా ఎఫెక్ట్‌..!

మార్చినెలలో దేశీయ ఆటోమొబైల్‌ రంగంపై కరోనావైరస్‌ ప్రభావం తీవ్రంగానే పడింది. దీంతో ఈ సారి విక్రయాల గణాంకాల్లో భారీ కోత పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జనతా కర్ఫ్యూ తర్వాత పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం 40శాతం నుంచి 80శాతం వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత కొన్నినెలలుగా ఆటోమొబైల్‌ రంగం కష్టకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జీఎస్‌టీ వచ్చినప్పుడు, నోట్ల రద్దు సమయంలో  కూడా ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ సారి మార్చిలో దాదాపు 1,50,000 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు విక్రయించినట్లు అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన