close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఏపీలో ఇవాళ నమోదుకాని కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. రాత్రి 9గంటల నుంచి ఈరోజు ఉదయం 9గంటల వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. పరీక్షల కోసం 217 మంది నమూనాలు  పంపగా 217 రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 348 పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 9కి చేరింది. ఆ తొమ్మిది మందిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌ పోలీసులపై మహేశ్‌ పోస్ట్‌

దేశంలో కరోనా కల్లోలం అధికమవుతోన్న తరుణంలో దాని కట్టడికి నిర్విరామంగా పనిచేస్తోన్న పోలీసులను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు ట్విటర్‌లో ఓ ట్వీట్‌ పెట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘కొవిడ్‌-19పై మన దేశం చేస్తున్న యుద్ధంలో అహర్నిశలు కష్టపడుతోన్న తెలంగాణ పోలీసు యంత్రాంగానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కోసం నిర్విరామంగా వారు అందిస్తున్న సేవలు అసాధారణమైనవి. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రాణాలతోపాటు, మన కుటుంబసభ్యుల జీవితాలను కాపాడుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైద్యుడి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి: చంద్రబాబు

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ సస్సెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇలాంటి చర్యతో ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో మనోధైర్యం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు. రక్షణ పరికరాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్‌ వెల్లడించారని తెలిపారు.  మాస్కులు, గ్లౌజులు అడిగిన వైద్యుడిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడాలేదని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మాకు వర్ణభేదాలు లేవు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్‌ను రాజకీయం చేయవద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోమ్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపట్ల పక్షపాత వైఖరి చూపుతోందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణలపై అథనోమ్‌ స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు జాతి, మత, కుల, వర్ణభేదాలు లేవని స్పష్టం చేశారు. అసలు క్వారంటైన్‌కు పంపాల్సింది కొవిడ్‌-19ని అని ప్రపంచ దేశాలు గుర్తించాలని  వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని ఎదర్కోవడానికి అందరూ కలిసికట్టు పోరాడటం ఒక్కటే పరిష్కార మార్గమని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో 166కి చేరిన కరోనా మరణాలు!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు అధికమౌతోంది. గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5734కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 166మంది మరణించగా 5095మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 473మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 17 మరణాలతోపాటు పాజిటివ్‌ కేసులు భారీగా నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికాలో ఒక్కరోజే 2వేల మంది బలి!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ మరణమృదంగం కొనసాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 1973మరణాలు సంభవించాయి. అంతకుముందు రోజు కూడా 1939మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్-19 బారినపడి మరణించినవారి సంఖ్య 14,695కి చేరింది. అమెరికాలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 4,35,128కి చేరింది. దీంతో ప్రపంచంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మోహన్‌లాల్, ఎన్టీఆర్‌ మరోసారి?

మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘జనతా గ్యారేజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయం సాధించింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారా? అందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వేదిక కాబోతోందా? అంటే టాలీవుడ్‌లో ఇదే టాక్‌ నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. కొమరం భీం జీవితంలో ఆయన బాబాయ్‌ ప్రధాన పాత్ర పోషించారట. అందుకే ఆ పాత్ర కోసం మోహన్‌లాల్‌ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లాక్‌డౌన్‌ వేళ: కవలలను కాపాడిన పోలీసులు

లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తున్న పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ముందుంటున్నారు. ఏడు నెలల వయసులోనే పుట్టిన కవల శిశువులను కాపాడేందుకు తమవంతు కృషి చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రిని అర్ధరాత్రి సమయంలో తెరిపించి తల్లీ బిడ్డలను సకాలంలో అక్కడికి తీసుకెళ్లారు. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్ట్‌ ట్యూబ్‌ విధానంలో గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఆమె రిమ్స్‌ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయి

 ‘‘విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్‌ - అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మానవతా దృక్పథంతో సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొందాం’’ అంటూ ట్విటర్‌లో ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

10. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌ రాజీవ్‌ స్వగృహలో నివాసం ఉండే ఏడుకొండలు, శమంతకమణి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. దంపతులిద్దరూ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె అంబిక(21) బీటెక్‌ చదువుతూ.. స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. ఇవాళ ఉదయం రాజీవ్‌ స్వగృహలోని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.