
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరోసారి కలకలం రేపింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సచివాలయం ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో 10 మందికి, జలవనరులశాఖలో ముగ్గురికి, పశు సంవర్థకశాఖలో ఒకరికి కరోనా నిర్దారణ అయింది. దీంతో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పలువురు ఉద్యోగులు ఇవాళ ఉదయం సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రాష్ట్రంలో తప్పిదాలకు కేసీఆర్‌దే బాధ్యత: కోదండరామ్
కరోనా బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ... ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఆర్థిక సాయం చేయాలని కోరారు. సీఎం సహాయనిధికి ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని తప్పిదాలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని, మొత్త వనరులను కొవిడ్ నిర్మూలనకు ఖర్చు చేయాలన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కేంద్రమంత్రిపై ఎందుకు కేసు పెట్టలేదు?: సీపీఐ
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటే.. కేంద్ర మంత్రి మాటలకు పరువు పోదా? అని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నిర్మలా సీతారామన్ ఇటీవల రెండు అవాస్తవాలు మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి ఓ మాట, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఓ మాట చెప్పారు. కేంద్ర మంత్రి మాటలకు మీ పరువు పోదా?. అమె మాటలు అబద్ధమైతే ఎందుకు కేసు పెట్టడం లేదు’’ అని రామకృష్ణ నిలదీశారు. కేంద్రంలో భాజపా నేతలు తప్పు చెబుతున్నారని అంటే.. కమ్యూనిస్టు నాయకులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత
నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శాంపిల్స్ సేకరణ నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి. ఐసీఎంఆర్ తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. 48 గంటల్లో లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పది కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్: భారత్ బయోటెక్
6. భారత్: 6 లక్షలు దాటిన కరోనా కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మరో 19,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 6,04,641కి చేరింది. అంతేకాకుండా, నిన్న ఒక్కరోజే 434మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృత్యువాతపడిన వారిసంఖ్య 17,834కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,59,860మంది కోలుకోగా మరో 2,26,947మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అదే చైనా నిజస్వరూపం: అమెరికా
భారత్ సహా సరిహద్దు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై అగ్రదేశం అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అది చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీ వెల్లడించారు. గత కొద్దివారాలుగా భారత్, చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించడంతో అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాగా, చైనా విస్తరణ కాంక్షను నిందిస్తూ భారత్‌కు అమెరికా మద్దతు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చార్మినార్‌పై సమంత యోగా: ఫన్నీ మీమ్స్
చార్మినార్‌పై సమంత యోగా చేయడం ఏంటా? అని ఆలోచిస్తున్నారా? ఫిట్నెస్ విషయంలో అగ్ర కథానాయిక సమంత ఏమాత్రం అశ్రద్ధ చూపరు. రోజులో కొంత సమయాన్ని తప్పకుండా వ్యాయామానికి కేటాయిస్తారు. తన అభిమానులను సైతం ఈ విషయంలో అప్రమత్తం చేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న సామ్ తన భర్త చైతన్యతో కలిసి యోగా చేస్తూ, పోషక విలువలతో కూడిన వంటలను నేర్చుకుంటున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా యోగా, ఆసనాలు వేసిన ఫొటోలను షేర్చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జీవీ కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదు
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి జీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.705 కోట్ల అక్రమాలకు సంబంధించి ఈకేసు నమోదైంది. విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇందులో ముంబయి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18లో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సీబీఐ ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కొవిడ్-19: మరో వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్విరామ కృషి జరుగుతోంది. వీటిలో ఇప్పటికే పలు కంపెనీలు మానవులపై ప్రయాగదశలో కొంత పురోగతి సాధించాయి. తాజాగా జర్మనీకి చెందిన బయోఎన్టెక్తోపాటు అమెరికా ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన టీకా మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. మానవుల్లో జరిపిన తొలిదశ ప్రయోగాల్లో వైరస్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని గుర్తించినట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి