
తాజా వార్తలు
మతతత్వ పార్టీగా ముద్రవేస్తున్నారు: అసదుద్దీన్
హైదరాబాద్: ఉగ్రవాదానికి మతం ఉండదని.. కానీ ఇప్పుడు దాన్ని ఒక మతంతో జోడిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మజ్లిస్‌ను మతతత్వ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ కేవలం హక్కుల కోసం పోరాడుతుందన్నారు. మనసులు కలిపే ప్రయత్నం చేస్తోందని.. మనసులను విడగొట్టేలా చేయదని చెప్పారు. 1960 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీని దేశవ్యతిరేక పార్టీగా భాజపా ఆరోపిస్తోందన్నారు.
స్థానిక ఎన్నికల్లో సమస్యల గురించి కాకుండా రోహింగ్యా, ఉగ్రవాదం, సర్జికల్ దాడులపై మాట్లాడుతున్నారని అసద్ మండిపడ్డారు. తనను జిన్నా అని ప్రచారం చేస్తున్నారని.. రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నాగా ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే సహాయం చేసేందుకు ఎవరూ రాలేదని.. ఓట్ల కోసం మాత్రం క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 200 కార్పొరేషన్లు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసినందునే భాజపా జాతీయ నేతల దృష్టి హైదరాబాద్‌పై పడిందని అసదుద్దీన్ ఆరోపించారు.