close

తాజా వార్తలు

వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడీవేడిగా కొనసాగాయి. రైతుభరోసా అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, అధికార పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తర్వాత  రూ.88వేల కోట్ల రుణాలను రూ.24వేల కోట్లకు కుదించారని ఆర్థిక మంత్రి బుగ్గన ఆరోపించారు. గత ప్రభుత్వంలో రైతులకు బ్యాంకు రుణాలు కూడా అందలేదని.. సున్నా వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు రద్దు చేశారని ఆయన విమర్శించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చే మీకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని వైకాపాను ఉద్దేశించి విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేసి చూపించామన్నారు. ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. వైకాపాను నమ్మి ప్రజలు మోసపోయారని ఆక్షేపించారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా కింద రూ.12,500 చెల్లించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ముందుంది మొసళ్ల పండగ .. లెక్కల గారడీ చేయలేరు’ అని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని.. నాలుగు, ఐదు విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ము రైతులకు చెల్లించాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపైనా ఉందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్ని కొనసాగించాల్సిన అవసరముందన్నారు. నాలుగు, ఐదు విడతల రుణ మాఫీ సొమ్ము వడ్డీతో సహా రైతులకు అందేవరకు తెదేపా పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘కుక్కతోక వంకర అనే సామెతకు సాక్షాత్తు చంద్రబాబే ఉదాహరణ’ అంటూ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: రోజా

తెదేపా హయాంలో 90 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రైతులకు మద్దతు ధర లేక సమస్యల్లో నలిగి ఆత్మహత్యలకు పాల్పడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రైతుల విషయంలో దివంగత రాజశేఖర్‌రెడ్డి రెండు అడుగులు ముందుకేస్తే.. సీఎం జగన్‌ నాలుగు అడుగులు ముందుకు వేశారన్నారు. నాలుగేళ్లు రైతుభరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఈ ఏడాది నుంచే  మొదలు పెట్టారని రోజా గుర్తు చేశారు. సాంబిరెడ్డి అనే వ్యక్తి ఉల్లికోసం వెళ్లి చనిపోయారంటూ అసెంబ్లీలో చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడారని.. దీనిపై సభకు ఆయన క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు.

అర్హత ఉన్న ఏ ఒక్క రైతునీ విడిచిపెట్టం: కన్నబాబు

తెదేపా అమలు చేసిన చాలా పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ హౌసింగ్‌, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన, ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ, పింఛన్లు, చంద్రన్న బీమా ఇలా.. ఏ పథకం తీసుకున్నా కేంద్రం వాటా ఉండేదని గుర్తు చేశారు. సీఎం జగన్‌ రైతు భరోసా ప్రకటించేనాటికి పీఎం కిసాన్‌ పథకంపై ప్రకటన రాలేదన్నారు. తెదేపా హయాంలో పేర్కొన్న రైతు రుణమాఫీకి ఆ ప్రభుత్వం ఎలాంటి పేరు పెట్టలేదని.. దానికి ‘చంద్రన్న దగా’ అని పెడితే సరిపోయేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్నికల ఎత్తుగడగా రుణమాఫీ పథకాన్ని చంద్రబాబు ప్రకటించారన్నారు. గత ఐదేళ్లలో రైతుల విషయంలో పూర్తిగా విఫలమైనందునే ఎన్నికల్లో ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారని చెప్పారు. తమ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు, ఉచిత పంటల బీమా తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క రైతునీ విడిచిపెట్టకుండా రైతు భరోసాను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా కన్నబాబు వివరించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సభను రేపటికి వాయిదా వేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.