
తాజా వార్తలు
ఒక్కరూపాయికే విమాన ప్రయాణం
‘ఆకాశమే నీ హద్దురా’ ట్రైలర్ చూశారా
హైదరాబాద్: దేశంలోని సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన జీఆర్ గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. దీనినే తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ‘ఆకాశమే నీ హద్దురా’ ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
‘అతి తక్కువ ధరలతో ప్రతి భారతీయుడు విమాన ప్రయాణం చేసే విధంగా ఓ గ్రామానికి చెందిన యువకుడు కనే అసాధ్యమైన కలే ఈ కథ’ అని ట్రైలర్ ప్రారంభంలో పేర్కొన్నారు. ‘వ్యవసాయం చేసేవాడూ విమానం ఎక్కుతాడు’, ‘విమాన టిక్కెట్టు.. ధర ఒక్క రూపాయే’ అంటూ ట్రైలర్లో సూర్య చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్లో సూర్య పాత్ర కోసం నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాకుండా మోహన్‌బాబు చెప్పిన డైలాగులు మెప్పించేలా ఉన్నాయి. నవంబర్ 12న ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది.