
తాజా వార్తలు
అదితి కూడా ఆ తరహా పాత్ర పోషిస్తోందా?
హైదరాబాద్: కథానాయకులు ప్రతి నాయక ఛాయలున్న పాత్రలు పోషించడం సాధారణమే. అదే హీరోయిన్లు పోషిస్తే, కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ‘ఎవరు’లో రెజీనా అలాంటి పాత్రే పోషించి మెప్పించారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరోయిన్ రాబోతోంది. ఆమే అదితి రావ్ హైదరీ. నాని, సుధీర్ బాబు కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘వి’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరీ నాయికలు. ఈ సినిమాలో నాని ప్రతినాయక ఛాయల్లో కనిపిస్తాడనే విషయం తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నానికి జంటగా నటిస్తున్న అదితి కూడా విలన్ పాత్ర పోషిస్తుందని సమాచారం.
సుధీర్, నివేదా మరో జోడీ. ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రలకే ప్రాధాన్య ఉంటుందని తెలుస్తోంది. అందుకే నాని సరసన నటించే నాయికకు విలనిజం పోషించే అవకాశం వచ్చిందని టాక్. మరి విలక్షణ పాత్రలో అదితి ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే మరో తేదీని ఖరారు చేయనుంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.