
తాజా వార్తలు
చెన్నై జట్టుకు మరో దెబ్బ.. రైనా బాటలో భజ్జీ
త్వరలోనే ఆ జట్టు నుంచి అధికారిక ప్రకటన..
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా బాటలోనే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ ఐపీఎల్ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడి అభిప్రాయాన్ని జట్టుకు తెలియజేసినట్లు సమాచారం. ఈ స్పిన్ బౌలర్ సైతం వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చెన్నై టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపైనా స్పష్టత రానుంది.
మరోవైపు ఐపీఎల్ నుంచి ఎవరైనా తప్పుకుంటే తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు ఒక్కసారి తాము వైదొలుగుతున్నట్లు జట్టుకు సమాచారం ఇచ్చి వెళ్లిపోతే మళ్లీ ఈ సీజన్లో ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉండగా, చెన్నై జట్టుకు భజ్జీ లేకపోతే వచ్చే సమస్యేమీ లేదు. ఎందుకంటే ఆ జట్టు ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లతో పటిష్ఠంగా ఉంది. రెగ్యులర్ స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, కరణ్ శర్మ కాకుండా ఈ సారి ఆ జట్టులో పీయూష్ చావ్లా సైతం చేరాడు. దీంతో హర్భజన్ తప్పుకోవడం ఇబ్బంది కాదు.
ధోనీ, వాట్సన్ కలిసి అల్పాహారం:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పలువురు కరోనా బారిన పడడంతో వారంతా క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఇంతకుముందు పాజిటివ్‌గా వచ్చిన దీపక్ చాహర్, రుతురాజ్ మినహా అందరికీ నెగటివ్‌గా తేలింది. దీంతో వారంతా నేటి నుంచి మైదానంలో ప్రాక్టీస్ చేసుకునే వీలు కలిగింది. అలా ఈ ఉదయం కెప్టెన్ ధోనీ, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కలిసి అల్పాహారం తిన్నారు. మరోవైపు కరోనా బారిన పడిన ఇద్దరు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని మాత్రం ఇంకా క్వారంటైన్‌లోనే ఉంచారు. వారు పూర్తిగా 14 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాకే మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. అప్పుడు నెగటివ్‌గా వస్తే ఇక వాళ్లని కూడా బయటకు అనుమతిస్తారు. అప్పటిదాకా ఆ 13 మంది ప్రత్యేకంగా ఉండక తప్పదు.