
తాజా వార్తలు
కోహ్లీ, రాహుల్ లేకుండానే ఐపీఎల్ టీమ్
అజిత్ అగార్కర్ జాబితాలో ఎవరెవరంటే..
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్ ఘనంగా ముగిసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే విజయవంతంగా నిర్వహించారు. ఈ సీజన్లో ఆది నుంచీ ఆధిపత్యం చలాయించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్స్‌లోనూ విజేతగా నిలిచి ఐదోసారి కప్పు ఎగరేసుకుపోయింది. దీంతో పలువురు మాజీలు ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో తమకు నచ్చిన జట్లను ప్రకటించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తన ‘డ్రీమ్ 11’ ఆటగాళ్లను పేర్కొన్నాడు.
అందులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి పేరుమోసిన బ్యాట్స్‌మెన్‌ని తీసుకోకపోవడం గమనార్హం. ఈ ఏడాది పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా మారిన రాహుల్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 14 మ్యాచ్‌ల్లో మొత్తం 670 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఎప్పటిలాగే 13వ సీజన్లోనూ తన పరుగుల ప్రవాహం కొనసాగించాడు. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 466 పరుగులు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇద్దరూ మంచి ప్రదర్శనే చేసినా అగార్కర్ వీరిద్దరిని పక్కనపెట్టాడు.
అగార్కర్ పేర్కొన్న జట్టు: డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్య, మార్కస్ స్టోయినిస్, కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, చాహల్, వరుణ్ చక్రవర్తి.