
తాజా వార్తలు
గంటకో సెల్ఫీ పంపండి
స్వీయనిర్భంధంలో ఉన్నవారికి కర్ణాటక ప్రభుత్వం సూచన
బెంగళూరు: కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి కర్ణాటక ప్రభుత్వం ఓ వినూత్న సూచన చేసింది. నిర్బంధంలో ఉన్నవారు ప్రతి గంటకు ఓ సెల్ఫీ పంపాలని కోరింది. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించి కొందరు బయట తిరుగుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ సూచన చేసింది.
ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు గంటకో సెల్ఫీ పంపాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన క్వారంటైన్ వాచ్ యాప్ను ఉపయోగించాలని తెలిపింది. ఈ యాప్ ద్వారా తీసిన ఫొటోలకు జీపీఎస్ అనుసంధానం జరిగేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా అనుమానితులు బయటకు వస్తే గుర్తించే అవకాశం ఉంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్బంధానికి పంపుతామని హెచ్చరించింది.