
తాజా వార్తలు
మందడం వద్ద కొనసాగుతున్న ఆందోళనలు
అదేమార్గంలో అసెంబ్లీకి వెళ్లిన సీఎం జగన్
ఆందోళన చేస్తున్న మహిళా రైతులు
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 349వ రోజుకు చేరాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఆందోళనలు తీవ్ర తరం చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో మందడం శిబిరంలో ఉన్న రైతులు, మహిళలు పెద్ద ఎత్తున జై అమరావతి నినాదాలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని చెప్పే వరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. దిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులతో కేంద్రం చర్చలకు సిద్ధమైందని, ఇక్కడ మాత్రం తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. రైతులు, మహిళలు, శిబిరం నుంచి బయటకు రాకుండా చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సీఎం కాన్వాయ్ ముందు నిరసన తెలియజేస్తూ..
ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతల నివాళి
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు సహా ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు మార్గమధ్యంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా నాయకులు