రఫేల్‌ స్వాగతానికి సిద్ధమైన అంబాలా!
close

తాజా వార్తలు

Updated : 29/07/2020 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఫేల్‌ స్వాగతానికి సిద్ధమైన అంబాలా!

అంబాలా: భారతదేశ వాయుసేనను బలోపేతం చేసే అధునాతన రఫేల్‌ యుద్ధ విమానాలకు ఘన స్వాగతం పలికేందుకు అంబాలా వైమానిక స్థావరం సిద్ధమైంది. వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా విమానాలను స్వీకరించనున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్‌ డ్రోన్ల కదలికలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైమానిక స్థావరం సమీపంలోని జాతీయ రహదారి 1ఏ పై రాకపోకల్ని నిలిపివేశారు. విమానాలు చేరుకునే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలను నిషేధిస్తూ ఆంక్షలు విధించారు. అంబాలా వైమానిక స్థావర పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు డీఎస్పీ అశోక్‌ శర్మ తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి ముప్పు లేకుంటే చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా వీధుల్లోకి తరలివచ్చి యుద్ధ విమానాలను స్వాగతం పలికేవారని స్థానిక ఎమ్మెల్యే అసీం గోయల్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రఫేల్‌ రాకను స్వాగతిస్తూ సాయంత్రం 7-7:30 మధ్య ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. 

ఫ్రాన్స్‌లోని బోర్డోలో నగరం నుంచి బయల్దేరిన ఐదు రఫేల్‌ విహంగాలు 7000 కిలోమీటర్లు ప్రయాణించి నేడు అంబాలాకు చేరుకోనున్నాయి. దాదాపు ఏడు గంటలకుపైగా ప్రయాణించి సోమవారం యూఏఈలోని అల్‌ దాఫ్రా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇవి గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. 30 వేల అడుగులు ఎత్తులో వాటికి.. ఫ్రెంచ్‌ ట్యాంకర్‌ విమానం ఇంధనాన్ని నింపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు అల్‌ దాఫ్రా నుంచి రఫేల్‌ విమానాలు బయలుదేరనున్నట్లు వైమానిక వర్గాలు తెలిపాయి. దిల్లీ, జామ్‌నగర్‌ ఏటీసీల నుంచి అందే సంకేతాలతో అంబాలాకు చేరుకుంటాయని వెల్లడించాయి.

భారత సైన్యం అమ్ముపొదిలో రఫేల్‌ చేరడాన్ని 23 సంవత్సరాలలో భారత వైమానిక దళంలో చోటుచేసుకుంటున్న అతికీలక పరిణామంగా రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. 4.5వ తరం విమానంగా పిలుస్తున్న ఈ విహంగాలు ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాలలో ఒకటి. ఒకే విమానంలో అనేక మిషన్లను చేపట్టగల ‘ఓమ్నిరోల్‌’ విహంగంగా రక్షణశాఖ దీన్ని పరిగణిస్తోంది. ఏవియానిక్స్‌, రాడార్‌ వ్యవస్థ, ఆయుధ వ్యవస్థ పరంగా రఫేల్‌ దక్షిణాసియాలోనే అత్యుత్తమ యుద్ధ విమానం అని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్‌ వద్ద ఉన్న ఎఫ్‌-16, చైనా తయారు చేసిన ఐదో తరం జేఎఫ్‌-20 కంటే కూడా రఫేల్‌ అత్యుత్తమైనదని తెలిపారు. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌, మాలి, లిబియా, ఇరాక్‌, సిరియాలో పలు సందర్భాల్లో రఫేల్‌ తన సత్తా చాటింది. 

రఫేల్‌ యుద్ధ విమానాలు అంబాలా చేరుకున్న తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లద్దాఖ్‌కు తరలించే అవకాశం ఉంది. తర్వాత విడతలో వచ్చే వాటిని పశ్చిమ బెంగాల్‌లోని హసిమారా వైమానిక స్థావరంలో ఉంచుతారు. ఇప్పటికే ఈ రెండు స్థావరాలను 400 కోట్లతో ఐఏఎఫ్ ఆధునికీకరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని