కరోనా ధాటికి దేశ రాజధాని విలవిల!
close

తాజా వార్తలు

Updated : 15/06/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ధాటికి దేశ రాజధాని విలవిల!

పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి కేంద్రం!
వరుస సమీక్షలు జరుపుతోన్న అమిత్‌ షా

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. నిత్యం ఇక్కడ 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. సోమవారం నాటికి దిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 41,182కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1327మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్న రాష్ట్రాల్లో దిల్లీ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. కరోనా బాధితులతో దిల్లీ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇప్పటికే పడకల కొరత ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా మరో 20వేల పడకలను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది.

దిల్లీలో ఏర్పడ్డ సంక్షోభాన్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముందుజాగ్రత్త చర్యగా 500రైలు బోగీల్లో 8వేల పడకలను సిద్ధం చేసి దిల్లీకి అందుబాటులో ఉంచుతున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. తాజా పరిస్థితిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ఉన్నతాధికారులతో రెండు ధఫాలుగా ఆదివారం సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే వారంరోజుల్లోనే దిల్లీలో భారీగా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దిల్లీలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రితోపాటు, ఆరోగ్యశాఖ అధికారులు, మేయర్లు ఇతర శాఖల  అధికారులతో పలు ధఫాలుగా అమిత్‌ షా చర్చలు జరిపారు. దిల్లీ ప్రభుత్వానికి సహకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకంగా దిల్లీకి బదిలీ చేశారు.

ప్రతి ముగ్గురిలో ఒకరికి..!

దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌ వస్తోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే 7353 శాంపిళ్లను పరీక్షించగా వారిలో 2,224 మందికి పాజిటివ్‌ అని తేలింది. గత వారం రోజుల్లోనే 34వేల పరీక్షలు నిర్వహించగా 11,239మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 30.24శాతం కరోనా పాజిటివ్‌ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలో ఇప్పటివరకు 2,90,592 నమూనాలకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రానున్న రోజుల్లో భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారిశాతం కూడా పెరగడం కాస్తం ఉపశమనం కలిగిస్తోంది.  ప్రస్తుతం దిల్లీలో 24,032 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

నేడు అఖిలపక్ష సమావేశం..
దిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రతరమౌతున్న దృష్ట్యా అన్నిరాజకీయ పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి ఆప్‌, కాంగ్రెస్‌, బీఎస్‌పీతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ తరపున దిల్లీ పీసీసీ నుంచి అనిల్‌ కుమార్ హాజరు కానున్నారు. ప్రజల నుంచి సేకరించిన పలు సూచనలు, సలహాలను కేంద్ర హోంశాఖ ముందు ఉంచుతామని వెల్లడించారు. 
ఇదిలా ఉంటే, సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,424కి చేరగా వీరిలో ఇప్పటివరకు 9520 మంది మృత్యువాతపడ్డారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని