close

తాజా వార్తలు

Updated : 21/05/2020 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కన్నా భయానకంగా అంపన్‌ తుపాను

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు..

కోల్‌కతా: కరోనా వైరస్‌ మహమ్మారి కన్నా అంపన్‌ పెను తుపాను తీవ్రత దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా బుధవారం అతలాకుతలమైంది. సుమారు ఆరు గంటలపాటు సాగిన దీని తీవ్రత ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుపాను పరిస్థితి సమీక్షిస్తున్నప్పుడు తన కార్యాలయం మొత్తం వణికిపోయినట్లు మమతా చెప్పారు. ఈ తుపాను కారణంగా ఎంత నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమని, అయితే.. వైరస్‌ కన్నా దీని ప్రభావం చాలా ఎక్కువే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తుపాను కారణంగా సుమారు 12 మంది మరణించారని తెలిపారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా- బంగ్లాదేశ్‌లోని హటియా దీవి మధ్య తీరాన్ని తాకిన తుపాను రాత్రి 7 గంటలకు తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే.

తుపాను తీరం దాటే వేళ ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా కోల్‌కతా నగరంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక్కడి వీధులన్నీ వర్షంతో నీట మునిగిపోయాయి. సుమారు 120-190 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లూ నేలమట్టమయ్యాయి. కాగా, పెను గాలులకు పలు చోట్ల పార్కింగ్‌‌ చేసిన కార్లు సైతం ఒకదానికొకటి ఢీకొన్నాయి. గురువారం సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి భయానక వీడియోలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా విమానాశ్రయం కూడా బాగా దెబ్బతిని పలు విమానాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్‌పోర్టు రన్‌వే మొత్తం నీటితో నిండిపోయింది. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 


 





Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని