close

తాజా వార్తలు

Updated : 10/08/2020 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాహ్‌ కుంబ్లే.. మేమింకా అది మర్చిపోలేదు..!

ఇంగ్లాండ్‌ గడ్డపై ఏకైక శతకం బాదిన స్పిన్‌ దిగ్గజం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లే మ్యాచ్‌ విన్నర్‌ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బౌలింగ్‌ మాయాజాలంతో ఒంటి చేత్తో భారత జట్టుకు అతడు అందించినన్ని విజయాలు మరే ఆటగాడూ అందించలేదు. వాటిలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి దిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే, కుంబ్లే బౌలింగ్‌లో ఎంత గొప్ప ఆటగాడైనా బ్యాటింగ్‌లో మాత్రం ఎప్పుడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ ఇంగ్లాండ్‌ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌ సందర్భంగా శతకం బాదాడు. అతడి కెరీర్‌లో అదే తొలిది, ఆఖరిది కూడా. 2007 టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా చివరి టెస్టులో అది సాధించి మరోసారి ఔరా అనిపించాడు. ఆ శతకం బాది నేటికి 13 ఏళ్లు పూర్తయ్యాయి.

కుంబ్లే శతకం.. టీమ్‌ఇండియా భారీ స్కోర్‌
రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా మూడు టెస్టుల సిరీస్‌ కోసం అప్పుడు ఇంగ్లాండ్‌కు వెళ్లింది. అప్పటికే తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ నిలబెట్టుకోవాలంటే ఓవల్‌లో ఆడే చివరి టెస్టులో విజయం సాధించాలి లేదా డ్రా చేసుకోవాలి. అలా ఆలోచించిన టీమ్‌ఇండియా మ్యాచ్‌ను డ్రా చేసుకోడానికే మొగ్గుచూపింది. ఫలితంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని 664 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. దినేశ్‌ కార్తిక్‌(91), సచిన్‌ ‌(82), వీవీఎస్‌ లక్ష్మణ్‌(51), ధోనీ(92) అర్ధశతకాలతో రాణించారు. ఆపై అనిల్‌ కుంబ్లే(110 నాటౌట్‌; 193 బంతుల్లో 16x4, 1x6) టెయిలెండర్లతో కలిసి కెరీర్‌లో తొలి శతకం నమోదుచేశాడు. అలా చివరి వరకూ క్రీజులో ఉండి జట్టుకు తిరుగులేని స్కోర్‌ అందించాడు. 

బౌలింగ్‌లోనూ మాయ చేసిన జంబో..
అనంతరం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగడంతో భారత బౌలర్లు రెచ్చిపోయారు. జహీర్‌ఖాన్‌ 3, శ్రీశాంత్‌ 2 వికెట్లు తీయగా జంబో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. దాంతో ఆతిథ్య జట్టు 345 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 300 పరుగుల పైచిలుకు ఆధిక్యం లభించినా ఆ జట్టును ఫాలోఆన్‌ ఆడనివ్వలేదు. రెండోసారి బ్యాటింగ్‌ చేసి 180/6 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌‌ చేసింది. చివరి రోజు ఇంగ్లిష్‌‌ జట్టు 369/6తో నిలవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ జంబో రెండు వికెట్లు తీశాడు. అలా తన బ్యాటింగ్‌తో శతకం బాదడమే కాక బౌలింగ్‌తో 5 వికెట్లు తీసినందుకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌ తర్వాత స్పిన్‌ దిగ్గజం కొద్ది నెలలకే టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి సారథ్యంలోనూ భారత్‌ పలు మ్యాచ్‌లు గెలుపొందింది. కుంబ్లే కెప్టెన్సీలోనే భారత్‌ 2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అప్పుడే తొలిసారి కంగారూ గడ్డ మీద చారిత్రక టెస్టు సిరీస్‌ గెలవాల్సి ఉన్నా వివాదాస్పద సిడ్నీ టెస్టులో అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు మూల్యం చెల్లించుకుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.