
తాజా వార్తలు
మూడో దశలోకి మరో చైనా వ్యాక్సిన్
పాకిస్థాన్ తదితర దేశాల్లో మూడోదశ ప్రయోగాలు
బీజింగ్: చైనాకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ అన్హుయి జిఫీ లాంగ్‌కామ్ బయోఫార్మస్యూటికల్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ ప్రయోగాల్లో ప్రపంచ వ్యాప్తంగా 29,000 వాలంటీర్లు పాల్గొననున్నారని సంస్థ వెల్లడించింది.
అన్హుయి, చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయెగాలకు జూన్ 19న అనుమతి లభించగా.. తొలి దశ ప్రయోగాలు జూన్ 23న ప్రారంభమయ్యాయి. మనుషులపై ఈ టీకా పనితీరును నిర్ధారించేందుకు బీజింగ్‌తో సహా పలు నగరాలకు చెందిన 18-59 సంవత్సరాల మధ్య వయస్కులపై ప్రయోగాలు చేపట్టారు. తొలి దశ ప్రయోగాల్లో భద్రత, వ్యాధినిరోధకతకు సంబంధించిన ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కేంద్రాల వద్ద పరిశోధన కొనసాగించేందుకు అన్హుయికి నవంబర్ 4న చైనా ఔషధ నియంత్రణ సాధికార సంస్థ అనుమతులు లభించాయి.
మూడో దశ ప్రయోగాలు ఈ నెలాఖరుకల్లా ఉజ్బెకిస్థాన్‌లో ప్రారంభమవుతాయని.. అనంతరం పాకిస్థాన్, ఇండోనేషియా, ఈక్వడార్‌లలో కొనసాగుతాయని అన్హుయి జిఫీ వెల్లడించింది. ఏడాదికి 300 మిలియన్ డోసుల కొవిడ్ టీకా ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకుందని తెలిపింది. ఇదిలా ఉండగా, తమ దేశంలో ప్రస్తుతం ఐదు కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని.. ఇవి యూఏఈ, బ్రెజిల్, పాకిస్థాన్, పెరూ తదితర దేశాల్లో కొనసాగుతున్నాయని చైనా ప్రకటించింది.