close

తాజా వార్తలు

Published : 25/10/2020 06:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

7 నెలల వరకూ యాంటీబాడీలు..!

మహిళలకంటే పురుషుల్లోనే అధికం - గుర్తించిన శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వారిలో ఎన్నిరోజులు యాంటీబాడీలు ఉంటాయనే విషయంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కోలుకున్నవారి శరీరంలో వీటిని ఏడు నెలల వరకూ గుర్తించామని తాజా అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. యాంటీబాడీల స్థాయికి, వయస్సుకు సంబంధం లేదని, కానీ, మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు పోర్చగల్‌ పరిశోధకులు గుర్తించారు. వీటికి సంబంధించిన అధ్యయనం యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమైంది.

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే దానిపై పోర్చుగల్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ మాలిక్యులర్‌ (ఐఎంఎం) శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. వైరస్‌నుంచి కోలుకున్న 90శాతం మందిలో 7నెలల వరకూ యాంటీబాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీబాడీల స్థాయికి, వయస్సుకు సంబంధం లేదని పరిశోధనలో కనుగొన్నారు. కానీ, యాంటీబాడీల స్థాయిలో వైరస్‌ తీవ్రత ప్రభావం ఉన్నట్లు పోర్చుగల్‌ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో యాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. ‘వైరస్‌ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వైరస్‌పై పోరాటం చేయడంలో దోహదపడుతాయి’ అని పరిశోధనకు సారథ్యం వహించిన డాక్టర్‌ వోల్దోయెన్‌ వెల్లడించారు.

వైరస్‌ లక్షణాలు బయటపడిన తొలి మూడు వారాల్లోపే శరీరంలో యాంటీబాడీల పెరుగుదల గణనీయంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం ఊహించిన విధంగానే మధ్యస్త స్థాయికి తగ్గిపోతున్నట్లు గమనించారు. ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు స్పష్టమైందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, కొన్నిరోజుల తర్వాత ఇద్దరిలో యాంటీబాడీలు ఒకే స్థాయికి పడిపోతున్నట్లు గుర్తించామన్నారు. వైరస్‌వ్యాప్తిలో ఈ యాంటీబాడీల సామర్థ్యం, రీ-ఇన్ఫెక్షన్‌పై వీటి ప్రభావాన్ని అంచనా వేయడంలో రాబోయేరోజులు మరింత కీలకమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ రోగనిరోధక శక్తి విశ్లేషణను తేలికగా అర్ధం చేసుకోవడంలో తమ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పరిశోధనలో భాగంగా, అక్కడి ఆసుపత్రుల్లోని 300 కొవిడ్‌ రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, 2500 మంది యూనివర్సిటీ సిబ్బందితోపాటు మరో 198 వాలంటీర్లపై పరిశోధన జరిపారు. పరిశోధనలో భాగంగా వీరందరికీ సిరాలజీ టెస్ట్‌(రక్త పరీక్ష) నిర్వహించారు. ఆరు నెలలపాటు ఈ పరిశోధన జరిగింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.