close

తాజా వార్తలు

Updated : 25/11/2020 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరువ్యాపారులకు అండగా ‘జగనన్న తోడు’: జగన్‌

అమరావతి: చిరువ్యాపారులు సమాజానికి సేవ చేస్తున్న మహానుభావులని.. వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చినట్లు ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న తోడు’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు రుణంగా ఇవ్వనున్నామని.. అంతేకాకుండా వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు వివరించారు. చిరు వ్యాపారులను పారదర్శక వ్యవస్థగా గుర్తించి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేసేలా ఒప్పించామన్నారు. ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని జగన్‌ స్పష్టం చేశారు. వారంలోపే 10లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు తెలిపారు. 

చిరువ్యాపారులు, చేతి వృత్తిదారులు, తోపుడు బండ్లు, పండ్లు, కూరగాయలు అమ్మేవారు, 5 అడుగుల వెడల్పు, పొడవు లేదా తక్కువ స్థలంలో వ్యాపారం చేసే వారికి ఈ పథకం వర్తించనుందని జగన్‌ చెప్పారు. చిరువ్యాపారులకు బ్యాంకర్ల సాయంతో స్మార్టు కార్డులు జారీ చేస్తున్నట్లు వివరించారు. బ్యాంకు ఖాతాలు తెరవడం సహా రుణాలు ఇప్పించేంత వరకు వాలంటీర్లు సాయం అందిస్తారని తెలిపారు. గ్రామ, వార్డుల వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు పథకం అమలు చేసే బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల బ్యాంకు బ్రాంచీల ద్వారా రుణాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. పథకానికి ఎంపిక కాకపోతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో నెలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారికి రెండు నెలల్లో రుణాలు ఇప్పిస్తామన్నారు. అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేనివారి కోసం కాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సహాయం అందనివారు 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చని జగన్‌ స్పష్టం చేశారు.Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన