49 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు
close

తాజా వార్తలు

Updated : 26/05/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

49 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

అమరావతి: న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై లక్ష్మీనారాయణ అనే న్యాయవాది దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి బాపట్ల ఎంపీ సురేశ్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సహా 49 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. హైకోర్టు వెలువరించిన కీలకమైన తీర్పులకు సంబంధించి న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై న్యాయవాది చేసిన ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘న్యాయమూర్తులను ఉద్దేశపూర్వకంగా కించపరిచారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయి. కోర్టులను రాజకీయాలకు వేదిక చేసుకోవడం బాధ కలిగించింది. కోర్టులకు లేనిపోనివి ఆపాదిస్తున్నారు. వైద్యుడు సుధాకర్‌ ఘటనలో న్యాయస్థానంపై లేనిపోని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక అనేక మంది ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యల ఘటనలో ఎంపీలూ ఉన్నారు. కోర్టులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు తీర్పుల్లో ఎలాంటి పక్షపాతం ఉండదు’’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.

మరోవైపు ఇదే అంశంపై మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ స్పందించారు. ‘‘కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించడం సరైందికాదు. కోర్టు తీర్పులపై హైకోర్టుకు వెళ్లవచ్చు. ప్రతి తీర్పుపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. న్యాయమూర్తులపై కామెంట్‌ చేయడం సరికాదు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది’’ అని మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అభిప్రాయపడ్డారు.
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని