
తాజా వార్తలు
కరోనాపై యాపిల్, గూగుల్ కొత్త సాంకేతికత
వాషింగ్టన్: కొవిడ్ బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం వినియోగించేలా టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్లు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాయి. ఇవి ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేస్తాయి. ఇవి యాప్‌లు కాదు. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే ఒక సాంకేతికతను(ఏపీఐ) వివిధ ప్రభుత్వాలు తయారుచేసిన కొవిడ్-19 యాప్‌ల కోసం వినియోగించుకొనేలా అవకాశం కల్పించాయి. ఎక్స్పోజర్ నోటిఫికేషన్ సిస్టమ్‌గా పిలిచే ఈ వ్యవస్థ బ్లూటూత్ ఆధారంగా పనిచేసే కొవిడ్-19 యాప్‌ల సామర్థ్యాన్ని పెంచుతుంది. 5 ఖండాల్లోని 22 దేశాల ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాయి. ఈ జాబితాలో భవిష్యత్తులో మరిన్ని చేరే అవకాశముంది. ‘‘మేం, యాపిల్ సంయుక్తంగా ది కొవిడ్ 19 ఎక్స్పోజర్ నోటిఫికేషన్ టెక్నాలజీని తయారుచేశాం. ఆయా దేశాల కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యవస్థను బలపర్చేందుకు ప్రజారోగ్య విభాగాలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వినియోగదారుల గోప్యతను రక్షిస్తూ.. కొవిడ్‌తో పోరాడాలనేదే మా లక్ష్యం’’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత ఆరోగ్యశాఖ అధికారులకుఉపయోగపడుతుందని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ పేర్కొన్నారు.