
తాజా వార్తలు
నా ఫొటోతో భాజపా ఓట్లు అడుగుతోంది: అసద్
హైదరాబాద్: ఎన్నికలొస్తేనే భాజపాకు రోహింగ్యాలు.. పాకిస్థాన్ గుర్తుస్తాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భోలక్‌పూర్‌లో అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరున్నరేళ్లుగా కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉందని.. పాతబస్తీలో పాకిస్థానీలు, రోహింగ్యాలు ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే పట్టించుకోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ హైదరాబాద్ వస్తున్న కేంద్ర మంత్రులు వరదల సమయంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వరద బాధితులకు కేంద్రం ఒక్కపైసా సాయం చేయలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో గొడవలు పెట్టాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భాజపా, మోదీ ఫొటోతో కాకుండా తన ఫొటోతో ఓట్లు అడుగుతోందని వ్యాఖ్యానించారు. చైనాకు వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం భాజపాకు లేదని.. అలా చేస్తే తప్పకుండా కేంద్రాన్ని ప్రశంసిస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.