
తాజా వార్తలు
ఈ విజయం వారిద్దరికీ అంకితం:సంజయ్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు భాజపాకు గురుతర బాధ్యత అప్పగించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసి..అబద్ధాలతో గెలిచిందని ఆక్షేపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెరాస కోసం ఆ పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఈసీ ఎక్కువగా కష్టపడ్డారని.. భాజపా కార్యకర్తలపై దాడులను డీజీపీ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ విజయాన్ని అడ్డుకునేందుకు యత్నించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), డీజీపీకి ఈ గెలుపును అంకితమిస్తున్నామని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు శాశ్వతంగా షెడ్డుకు వెళ్లిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని.. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. భాజపా ఏ వర్గానికీ వ్యతిరేకం కాదన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయని సంజయ్ ఆరోపించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం కోరుకుంటున్న హైదరాబాద్ ప్రజలు.. భాజపాకు మెరుగైన విజయాన్ని అందించారన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర నుంచి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు, ధర్మం, అమరవీరుల ఆశయాలు, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పనిచేస్తామని సంజయ్ తెలిపారు.