
తాజా వార్తలు
దిల్లీ ఫైట్: 57మందితో భాజపా తొలి జాబితా
దిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే 57 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో 11 మంది ఎస్సీ అభ్యర్థులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఇటీవలే భాజపాలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రాకు కూడా కాషాయ పార్టీ టికెట్ ఇచ్చింది. మాడల్ టౌన్ స్థానం నుంచి మిశ్రాను పోటీకి దింపింది.
అయితే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసే అభ్యర్థి పేరును మాత్రం భాజపా ఇంకా ఖరారు చేయలేదు. న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని తివారీ వెల్లడించారు. దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన విజయ్ గుప్తా మరోసారి రోహిణి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడుతాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ జాబితా వెలువడాల్సి ఉంది.
గత ఎన్నికల్లో 67 స్థానాలతో జయభేరీ మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉంది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో గెలిచిన భాజపా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.