
తాజా వార్తలు
సంపూర్ణ మద్దతిస్తాం: బండి సంజయ్
వేతనాల కోతపై పునరాలోచించాలని సూచన
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంపూర్ణ మద్దతిస్తామని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పేద, సామాన్య ప్రజల లబ్ధి కోసం ప్రధాని మోదీ సుమారు రూ. 1.70లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చారని లేఖలో పేర్కొన్నారు. రాష్ర్టంలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానం ద్వారా రాష్ర్ట కార్మిక శాఖ వద్ద నమోదైన సుమారు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించిన రూ.2,300 కోట్ల సెస్ నిధులను ఖర్చు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ.. కేంద్ర కార్మిక శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. దీనికి అనుగుణంగా రాష్ర్టంలోని భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా డబ్బు పంపించే ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల సంఘాలతో చర్చించకుండా మార్చి నెల జీతాల్లో 50 శాతం తగ్గించే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు. వేతనంపై ఆధారపడి బతికే ఉద్యోగుల వేతనాల్లో ఏకపక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్తమవుతుందన్నారు.