స్టాక్‌ మార్కెట్లు: పడి లేచి మళ్లీ పడి
close

తాజా వార్తలు

Updated : 19/03/2020 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్లు: పడి లేచి మళ్లీ పడి

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లకు కరోనా భయాలు వీడడం లేదు. దీనికి తోడు అంతర్జాతీయ సూచీలు, ఆర్థిక మందగమనం, క్రూడాయిల్‌ ధరల ప్రభావంతో మన స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ మళ్లీ పడ్డాయి. ఓ దశలో సుమారు 1500 పాయింట్లు నష్టపోయిన మార్కెట్‌ యూరప్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమవ్వడంతో నష్టాల నుంచి కోలుకుని మళ్లీ లాభాల్లోకి వచ్చినా ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. చివర్లో అమ్మకాల ఒత్తిడి లోనవ్వడంతో సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 581.28 పాయింట్లు నష్టపోయి 28,288 వద్ద ముగిసింది. నిఫ్టీ 205.35 పాయింట్లు నష్టపోయి 8,263.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.07 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, కోటాక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభ పడగా.. భారతీ ఇన్ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యెస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.


నిఫ్టీ గ్రాఫ్‌

అమెరికా మార్కెట్ల నష్టాలు..

నిన్నటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్‌ 6.3శాతం, నాస్‌డాక్‌ 4శాతం, ఎస్‌అండ్‌పీ 500 కూడా నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. దీనికి తోడు నేటి ఉదయానికి ఫ్యూచర్‌ మార్కెట్లలో డోజోన్స్‌ 700 పాయింట్లుకు పైగా  పతనం కావడంతో సంక్షోభం తప్పదనే సంకేతం బలంగా ఇన్వెస్టర్లలోకి వెళ్లింది. ఈవారం వరుసగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు ఈదెబ్బకు తమ పతనాన్ని కొనసాగించాయి.  

భారీగా పతనమైన క్రూడ్‌ ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు నిన్న రాత్రి భారీగా పతనం అయ్యాయి. అమెరికా  చమురు ధరలు బ్యారెల్‌ 20డాలర్ల వద్దకు చేరింది. 2002నాటి స్థాయికి పతనం అయ్యాయి. ఇవ్వన్నీ మార్కెట్లలో భయాలను రేపాయి. నేడు దేశీయ మార్కెట్లలో చమురు రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ షేర్లు భారీగా విలువ కోల్పోవడం సూచీలపై ప్రభావం చూపింది. 

ఫెడ్‌ రంగంలోకి దిగడంతో..

అమెరికా ఫెడరల్‌ రిజర్వు నిన్న అర్ధరాత్రి రంగంలోకి దిగి మనీ మార్కెట్‌ మ్యూచివల్‌ ఫండ్స్‌కు అత్యవసర రుణాలను మంజూరు చేస్తామని పేర్కొంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ అత్యవసర చర్యలు మార్కెట్లను రాబోయే ఆర్థిక కష్టాలకు సంకేతంగా భావించారు. 

2లక్షలు దాటిన కరోనా కేసులు..

నిన్నటితో కరోనావైరస్‌ సోకిన వారిసంఖ్య 2లక్షలను దాటింది. రెండువారాల్లో ఈ సంఖ్య రెట్టింపు కావడంతో మరిత తీవ్రమై ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు దేశాలు క్వారెంటైన్లలోకి వెళతాయనే ఆందోళనలకు ఈ అంకె ఆజ్యంపోసింది. నేటి ఉదయానికి రోగుల సంఖ్య 2,10,732కు చేరగా మృతుల సంఖ్య 8,840కు పెరిగింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని