close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనాపై ఫేక్‌ న్యూస్‌.. వీటిని నమ్మకండి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: కరోనా మహమ్మారి గురించి సోషల్‌మీడియాలో కుప్పలుతెప్పలుగా పోస్టులు వచ్చిపడుతున్నాయి. దేశంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న వేళ పోస్టులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. తోటి వారికి అవగాహన కల్పించేందుకు ఇలా పోస్టులు పెట్టడం మంచిదే అయినా అవగాహన మాటున కొందరు ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తుండడం విచారకరం! ఇటలీలో కుప్పలు తెప్పలుగా శవాలను పూడ్చిపెడుతున్నారని.. రష్యాలో సింహాలను వీధుల్లోకి వదిలారని కొన్ని అసత్య వార్తలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇవి ప్రజల్లో అప్రమత్తత పెంచకపోగా భయాందోళనలకు కారణమవుతున్నాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో ఇటీవల కాలంలో వాట్సాప్‌ గ్రూప్‌ల్లో సర్క్యులేట్‌ అవుతున్న కొన్ని పోస్టుల అసలు నిజాలు ఇక్కడ అందిస్తున్నాం..


నిజంగా సింహాలు వదిలారా?

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా రష్యా ప్రభుత్వం సుమారు 500 సింహాలను రోడ్లపైకి విడిచిపెట్టారంటూ కొన్ని పోస్టులు కనిపించాయి. వాస్తవానికి రష్యా ప్రభుత్వం అలాంటి చర్యలేవీ చేపట్టలేదు. వాస్తవానికి అదో సినిమాలోని సీన్‌. 2016లో దక్షిణాఫ్రికాలో ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా తీసిన చిత్రమిది.


కుప్పలుగా పూడ్చిపెట్టడం అవాస్తవం!

కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన దేశం ఇటలీ. ఆ దేశం నిర్లక్ష్యం కారణంగా మూల్యం చెల్లించుకుంటున్న మాట వాస్తవం. కానీ అక్కడ చనిపోయిన వారిని పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించి గుట్టలుగా పోస్తున్నారన్నది అవాస్తవం. 2016లో వచ్చిన ‘పాండమిక్‌’ అనే సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలోనిది ఆ వీడియో. కరోనా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇది బాగా వైరల్‌ అయ్యింది.


జియో ప్లాన్‌ మనకు తెలీకుండానా?

ఇటీవల కాలంలో వైరల్‌ అవుతున్న మరో పోస్ట్‌ జియో గురించి. ఆ సంస్థ ఓ లైఫ్‌టైమ్‌ ప్లాన్‌ను కేవలం రూ.498కే అందిస్తోందని, అందుకోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ ఓ పోస్ట్‌ సర్క్యులేట్‌ అవుతోంది. జియో అలాంటి ప్లాన్‌ ఏదీ ప్రకటించలేదు. అలాంటి కొత్త ప్లాన్‌ ఏదైనా తీసుకొచ్చి ఉంటే ‘మై జియో’ యాప్‌లో చెక్‌ చేసుకోవడం ఉత్తమం. అంతేగానీ వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేస్తే లైఫ్‌టైమ్‌ ప్లాన్‌ మాట అటుంచితే సైబర్‌ నేరగాళ్ల బారిన పడడం మాత్రం ఖాయం!


పిట్టల్లా రాలిపోయారా?

ఇటలీకే చెందిన మరో పోస్ట్‌ ఇది. జనాలు పిట్టల్లా రాలిపోయారన్నది దాని సారంశం. పైగా శాటిలైట్‌లో తీశారట. ఇది 2014 మార్చిలో రాయిటర్స్‌ వార్తా సంస్థ తీసిన చిత్రమిది. ఆర్ట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడి ప్రజలంతా ఇలా నడక మార్గంలో నేలపై పడుకున్నారు.


ఆ పుస్తకంలో ఏముంది?

రమేశ్‌ గుప్తా అనే డాక్టర్‌ రాసిన 12వ తరగతి జంతుశాస్త్రం పుస్తకంలోని 1072 పేజీలో కరోనా వైరస్‌ మందు గురించి రాశారనేది ఆ పోస్ట్‌ సారాంశం. డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలు ఇలాంటి పుస్తకాలు పట్టించుకోవడం లేదట. వాస్తవానికి అందులో ఉన్నది కేవలం కరోనా వైరస్‌ గురించి మాత్రమే. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ కుటుంబానికి చెందిన కొత్త వైరస్‌. దీని పేరు నోవల్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19). ఇంతకుముందెప్పుడూ ఇది వెలుగులోకి రాలేదని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.


ఇవే కాదు.. కరోనాకు మెడిసన్‌ కనుగొన్నారని, కరోనా వైరస్‌ జీవిత కాలం 12 గంటలు మాత్రమేనంటూ పోస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బాధ్యతగా మెలగాల్సిన వారు అసత్య వార్తలను ప్రచారం చేస్తుండడం నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇలాంటివి షేర్‌ చేసే ముందు ఇంకో నలుగురికి అసత్యాలు చేరవేస్తున్నామన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. అందుకే సోషల్‌ మీడియాలో వచ్చేవి నమ్మకుండా వాస్తవాలు ప్రచురించే నమ్మదగిన పత్రికలు, న్యూస్‌ వెబ్‌సైట్లు, టీవీలను ఆశ్రయించడం ఉత్తమం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.