close

తాజా వార్తలు

Published : 26/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోగిన బిహార్‌ ఎన్నికల నగారా

దిల్లీ: బిహార్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. అక్టోబర్‌ 28న తొలిదశలో 71 స్థానాలకు, నవంబరు 3న రెండో దశలో 94  స్థానాలకు, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నవంబరు 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు.  

ఈ సందర్భంగా సునీల్‌ అరోరా మాట్లాడుతూ.. గణాంకాల పరంగా చూస్తే మహమ్మారి విజృంభణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇదే అతిపెద్దదని తెలిపారు. రోజులు గడుస్తున్నా మహమ్మారి విజృంభణ అదుపులోకి వస్తున్న సంకేతాలేవీ కానరాలేదన్నారు. దీంతో ప్రజలకు వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం ఎలాగైనా కల్పించాలని నిర్ధారణకు వచ్చామన్నారు. అదే సమయంలో ఎన్నికల్ని సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఏడు లక్షల శానిటైజర్‌ యూనిట్లు, 46 లక్షల మాస్కులు, ఆరు లక్షల పీపీఈ కిట్లు, 23 లక్షల జతల చేతి తొడుగులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఓటర్ల కోసం ఒకేసారి వాడి పడేసే 7.2 కోట్ల చేతి తొడుగులు అందించనున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో రద్దీ తగ్గించేలా ఓటింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటును నమోదు చేయోచ్చన్నారు. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఇది అమలు కాదని స్పష్టం చేశారు.

కొవిడ్‌-19 బాధితులు ఓటింగ్‌ చివరి రోజు తమ పోలింగ్‌ బూత్‌లో ఓటు నమోదు చేయొచ్చని అరోరా ప్రకటించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది వారిని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇప్పటికే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించామని.. దాంతో పాటు ఈ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియా సంస్థలు తమ వేదికలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు వహించాలని అరోరా కోరారు. 

కరోనా విజృంభణ తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ప్రస్తుత బిహార్‌ అసెంబ్లీ పదవీకాలం నవంబరు 29తో ముగియనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సురక్షితంగా ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సహా పలు వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. 

ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ, భాజపాతో కలిపిన ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈసారి కూడా ఎన్‌డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. ఇక భాజపా, జేడీయూతో తలపడేందుకు కాంగ్రెస్‌, ఆర్జేడీ సిద్ధమవుతున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.